భీంరెడ్డి అక్రమ సామ్రాజ్యం !
- 500 కోట్ల ఆస్తులు కూడబెట్టిన డీఎస్పీ
- డైరీ, వాట్సాప్ చాట్స్‌పై ఏసీబీ నజర్
- మాజీ ఐపీఎస్ అధికారికి శాశ్వత బినామీ?
- మీడియా, రాజకీయ పెద్దలతోనూ లింకులు..
- నేడో రేపో సస్పెన్షన్ వేటు!
సిటీబ్యూరో, జూలై 8 (విజయక్రాంతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డి అక్రమాస్తులు రూ.500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. భీంరెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ, వాట్సాప్ చాట్స్, కోడ్ లాంగ్వేజ్‌ను డీకోడ్ చేసేందుకు ఏసీబీ సాంకేతిక నిపుణుల సాయం తీసుకుంటోంది. ఇవి డీకోడ్ అయితే భీంరెడ్డి ఎవరెవరికి బినామీ? భీంరెడ్డికి ఎవరెవరు బినామీ? అనే పూర్తి చిట్టా బయటపడనుంది.
ప్రాథమిక సోదాల్లో సుమారు రూ.300 కోట్ల ఆస్తులు బయటపడగా, ఏసీబీ అధికారుల అంతర్గత విచారణలో వెలుగుచూస్తున్న వాస్తవాలు విస్తుగొలుపుతున్నాయి. ఈ కేసులో డొంక కదులుతుండటంతో పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భీంరెడ్డి వెనుక ఉన్న ఆ పెద్దలు ఎవరనే దానిపై ఇప్పుడు తెలంగాణవ్యాప్తంగా హాట్ టాపిక్ నడుస్తోంది.
మాజీ ఐపీఎస్‌కు శాశ్వత బినామీ?
భీంరెడ్డి వెనుక ఒక శక్తివంతమైన మాజీ ఐపీఎస్ ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. 1993లో కానిస్టేబుల్‌గా చేరి, 1995 బ్యాచ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికైన భీంరెడ్డికి.. తన సర్వీసులో ఎక్కడా ప్రాధాన్యత లేని పోస్టులు లేకుండా, హైదరాబాద్, సైబరాబాద్ పరిధుల్లో నిరంతరం ఫోకల్ పోస్టింగ్స్ దక్కడం వెనుక ఆ ఉన్నతాధికారి ప్రోత్సాహం ఉన్నట్లు తెలుస్తోంది.
కలబురిగిలో 45 ఎకరాలు ఎవరివి?
కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా కలబురిగి పట్టణ సమీపంలో ఏసీబీ గుర్తించిన 38 నుంచి 45 ఎకరాల భారీ వ్యవసాయ భూమి సదరు మాజీ ఐపీఎస్ అధికారిదేనని, దానికి భీంరెడ్డి కేవలం బినామీగా వ్యవహరించాడని సమాచారం. ఆ ఉన్నతాధికారి తన సర్వీసు కాలంలో సంపాదించిన అక్రమ సొమ్మును భీంరెడ్డికి అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. విధి నిర్వహణలో సదరు అధికారి అండ చూసుకొని భీంరెడ్డి సివిల్ వివాదాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి ప్లాట్లు, ఫ్లాట్లను తమ బంధువులు, స్నేహితుల పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకొని, ప్రతి పనిలోనూ ఆ ఉన్నతాధికారికి వాటా ఇచ్చేవాడని పోలీసు వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.
మీడియా, పోలీస్, రాజకీయ నెట్వర్క్!
భీంరెడ్డి నెట్వర్క్ చూసి ఏసీబీ అధికారులే అవాక్కవుతున్నారు. కేవలం ఒక పోలీస్ అధికారిగా కాకుండా ఒక పెద్ద సిండికేట్ను ఆయన నడిపినట్లు ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక అధిపతి, మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)తో భీంరెడ్డికి బలమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఒక జిల్లా ఎస్పీతో పాటు, ఒక ట్రై-కమిషనరేట్ పరిధిలోని డీసీపీతోనూ ఈయనకు ఆర్థిక సంబంధాలు ఉన్నట్లు సమాచారం.
ఒక జాతీయ పార్టీ (బీజేపీ)కి చెందిన సీనియర్ మహిళా నేత ఇంట్లో మనిషిలా ఉంటూ వ్యవహారాలు చక్కబెట్టడమే కాకుండా, పలువురు అధికార పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలతోనూ వ్యాపార భాగస్వామ్యాలు నెరిపినట్లు తెలుస్తోంది. ఈ పొలిటికల్ లాబీయింగ్ వల్లే వనస్థలిపురం ఏసీపీగా, పటాన్‌చెరు డీఎస్పీగా ఈయన చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.
70 చోట్ల ఆస్తులు.. 15 మంది బినామీలు
అరెస్ట్ భయం లేకుండా భీంరెడ్డి అత్యంత చాకచక్యంగా ఆస్తులను తన పేరుపై కాకుండా ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇప్పటివరకు 70 ప్రాంతాల్లో ప్లాట్లు, ఫ్లాట్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇందుకోసం హోంగార్డులు, కానిస్టేబుళ్లు, చివరకు తన సొంత డ్రైవర్‌ను కూడా బినామీలుగా వాడుకున్నట్లు తేలింది. ప్రస్తుతం ఏసీబీ 15 మంది బినామీలను గుర్తించగా, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 2 ఎకరాలు, జహీరాబాద్లో 3.5 ఎకరాల భూములపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. భీంరెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ, వాట్సాప్ చాట్స్, కోడ్ లాంగ్వేజ్‌ను డీకోడ్ చేసేందుకు ఏసీబీ సాంకేతిక నిపుణుల సాయం తీసుకుంటోంది.
ఇవి డీకోడ్ అయితే భీంరెడ్డి ఎవరెవరికి బినామీ? భీంరెడ్డికి ఎవరెవరు బినామీ? అనే పూర్తి చిట్టా బయటపడనుంది. ఏసీబీ నివేదిక ఆధారంగా పోలీస్ శాఖ భీంరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది. కాగా, సోమవారం అరెస్ట్ అయిన భీంరెడ్డిని మంగళవారం ఏసీబీ అధికారులు ఉస్మానియా హాస్పిటల్లో వైద్యపరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు.
న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో భీంరెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. భీంరెడ్డి అక్రమ సంపాదనతో వరంగల్‌కు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి కుమార్తెతో తన కుమారుడి పెళ్లి సంబంధాన్ని కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. అలాగే ఒక ప్రముఖ దేవాలయ బోర్డు చైర్మన్‌తోపూ ఈయనకు ఉన్న ఆర్థిక, వ్యాపార సంబంధాలపై ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది.






