లాభాల లాలూచీ.. బ్యాంక్ ఖాతా ఖాళీ!
- ఫేస్‌బుక్‌లో పరిచయం రూ.2.36 కోట్ల మోసం
ఏపీకే యాప్ ట్రేడింగ్ పేరుతో దోపిడీ
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): -ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ మాటలు నమ్మిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఏకంగా రూ.2.36 కోట్లు కోల్పోయాడు. పరిచయం పేరుతో మొదలైన చాటింగ్, నమ్మకం పెంచిన మాటలు, ట్రేడింగ్ పేరిట పెట్టుబడులు చివరికి ఖాతా ఖాళీ కావడం ఈ ఘటనలో బయటపడింది. కొండాపూర్ కు చెందిన వీరభద్రరావు ఈ సైబర్ మోసానికి బలయ్యాడు. గత ఏడాది ఆగస్టులో ‘కోరా’ పేరుతో ఓ మహిళ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. తాను సింగపూర్‌కు చెందినదానినని, ముంబయిలో ఉంటున్నానని చెప్పి సన్నిహితంగా మెలిగింది.
రోజూ చాటింగ్ చేస్తూ నమ్మకం పెంచి, ఫేస్‌బుక్‌లో స్టోర్ ద్వారా భారీ లాభా లు వస్తాయని చెప్పి పెట్టుబడుల వైపు మళ్లించింది. ఆపై ఒక ఏపీకే ఫైల్‌ను పంపించి బాధితుడి ఫోన్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేయించింది. తర్వాత ‘బెల్లా’ పేరుతో మరో వ్యక్తిని పరిచయం చేసి ట్రేడింగ్ సూచనలు ఇప్పించారు. యాప్‌లో లాభాలు పెరుగుతున్నట్లు చూపిస్తూ మరింత డబ్బు పెట్టించారు.
సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 12 వరకు పలు విడతలుగా క్రిప్టో వాలెట్ల ద్వారా రూ. 2.36 కోట్లను బదిలీ చేయించాడు. విత్‌డ్రా చేసే అవకాశం లేకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు చివరికి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




