మాదిగలకు రెండు సీట్లు ఇవ్వాలి
మాజీ మంత్రి మోత్కుపల్లి దీక్ష
జరిగిన అన్యాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళతా
పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల టికెట్ల కేటాయింపుల్లో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు కేటాయిం చాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు గురువారం ఆయన నివాసంలో ఒక రోజు దీక్ష చేపట్టారు. మోత్కుపల్లి చేపట్టిన దీక్షకు పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనా రాయణ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేశ్, చింతస్వామితో పాటు కాంగ్రెస్ నాయకులు, వివిధ సంఘాల నేతలు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి మాదిగలకు మొదటి నుంచి వెన్నంటి ఉన్నారని, టికెట్ల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లుతానని తెలిపారు.
నర్సింహులు చేపట్టిన దీక్షలో న్యాయం ఉందని, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోరాటం చేయడం విద్యార్థి దశ నుంచే మెత్కుపల్లికి అలవాటన్నారు. ఎంపీ సీట్లలో మాదిగలకు అవకాశం ఇవ్వకపోవడం వల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. టికెట్ల కేటాయింపు లో జరిగిన పొరపాటును సరిదిద్దకపోతే.. మాదిగలు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందన్నా రు. తాను పార్టీ మారే ఆలోచన లేదని తెలిపారు. మోత్కుపల్లి నరసింహులు చేసే పోరాటానికి ఎమ్మార్పీఎస్ మద్దతు ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ స్పష్టం చేశారు.






