కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది పాలమూరు!

28-04-2024 12:10:00 AM

మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి 

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు రాజ కీయ భిక్ష పెట్టింది పాలమూరేనని, అయినప్పటికీ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత పాల మూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తుంగలో తొక్కి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రైతుల నోట్లో మట్టికొట్టారని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో చీకటి ఒప్పదం చేసుకుని కృష్ణా జలాలను మళ్లించారని, పాలమూరుకు వందలాది కంపెనీలు వస్తాయని కేసీఆర్ నాడు మాట ఇచ్చారని, కానీ ఆ కంపెనీలన్నింటినీ తన సొంత జిల్లా మెదక్‌కు తీసుకుపోయారని ఆరోపించారు.

2018 ఎన్నికల వాగ్దానం లో రైతులకు ఏకకాలంలో రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా  బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తుందన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. సమావేశంలో పార్టీ నేతలు చంద్రకుమార్ గౌడ్, వెంకటేష్, సిరాజ్ ఖాద్రీ, సీజె బెనహర్, రాములు, లక్ష్మణ్‌యాదవ్ పాల్గొన్నారు.