12 August, 2026 | 1:36 AM

కోతీరాంపూర్‌లో ఘనంగా మైసమ్మతల్లి బోనాలు

12-08-2026 12:00 AM

దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తాం: ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్, ఆగస్టు 11 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతీరాంపూర్ లో మైసమ్మ తల్లి బోనాల వేడుకలు మంగళవారం కన్నులపండువగా జరిగాయి. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల.. ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు జంగిలి ఐలందర్ యాదవ్, ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్, బీఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.