12 August, 2026 | 1:35 AM

పద్య కావ్యం పెన్నిధి ఆవిష్కరణ

12-08-2026 12:00 AM

కోడీహళ్లి ఫణి ప్రసన్నకుమార్ రచన

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): కోడీహళ్లి ఫణి ప్రసన్న కుమార్ రచించిన పద్య కావ్యం పెన్నిధి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ ప్రగతి నగర్‌లోని సుందరయ్య భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ గేయ కవి, స్వర్ణ నంది పురస్కార గ్రహీత సాదనాల వేంకటస్వామి నాయుడు అధ్యక్షత వహించారు. ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు, విశ్రాంత ఉపన్యాసకుడు డా. వింజమూరి విశ్వనాథమయ్య గ్రంథావిష్కరణ చేశారు.

అణు ఇంధన సంస్థ విశ్రాంత శాస్త్రవేత్త, యువభారతి సంస్థ అధ్యక్షుడు, ప్రముఖ కవి డా. ఆచార్య ఫణీంద్ర కావ్యాన్ని పరిచయం చేస్తూ ఈ కావ్యం ఒక ఉత్కంఠభరితమైన సస్పెన్స్‌తో కూడిన ఒక చలనచిత్రం చూసినట్టు ఉందని అన్నారు. విశిష్ట అతిథి డా.రాధశ్రీ కావ్యాన్ని, కావ్యకర్తను ప్రశంసిస్తూ పద్య ప్రసంగం చేశారు. సుందరయ్య భవన్ కార్యదర్శి మల్లయాచారి తదితరులు ప్రసంగించారు. గ్రంథకర్త ఫణిప్రసన్న కూమార్ వేదికపైనున్న పెద్దలకు తన కృతజ్ఞతను తెలుపుతూ తన కావ్యంలోని కొన్ని పద్యాలను చదివి సభను రంజింపజేశారు.