12 August, 2026 | 2:45 AM

మస్కట్‌లో మహిళ నరకయాతన

12-08-2026 12:00 AM
  1. కేటీఆర్ చొరవతో స్వదేశానికి మహాముదా 
  2. 25 రోజుల నరకయాతనకు తెర

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): గల్ఫ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నకిలీ ఏజెంట్లు చేస్తున్న మోసాలకు మరో మహిళ బలైంది. టూరిస్ట్ వీసాపై మస్కట్ వెళ్లిన వరంగల్‌కు చెందిన మహమ్మద్ మహాముదా (45) అక్కడ సబ్‌ఏజెంట్ చేతిలో బందీగా మారింది. ఫోన్, పాస్‌పోర్టు లాక్కొని గదిలో నిర్బంధించి, తమకు నచ్చిన పని చేయాలంటూ వేధింపులకు గురిచేశారు. స్వదేశానికి వెళ్లాలని కోరితే దొంగతనం కేసు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించారు.

దాదాపు 25 రోజులపాటు నరకయాతన అనుభవించిన ఆమె.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆమెను స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన పూర్తి ఖర్చును కేటీఆర్ వ్యక్తిగతంగా భరించారు. వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన మహాముదా జూలై 16న ఉద్యోగం కోసం మస్కట్ వెళ్లారు. ఇంట్లో పని ఇప్పిస్తామని నకిలీ ఏజెంట్ చెప్పడంతో టూరిస్ట్ వీసాపై అక్కడికి చేరుకున్నారు.

అయితే మస్కట్ వెళ్లిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సబ్‌ఏజెంట్ ఆమె ఫోన్ను తీసుకుని ఒక గదిలో బంధించారు. పాస్పోర్టును కూడా స్వాధీనం చేసుకుని తమకు చెప్పిన పని చేయాలంటూ ఒత్తిడి చేశారు. దాడి చేసి వేధించినట్లు బాధితురాలు వెల్లడించారు. తాను స్వదేశానికి తిరిగి వెళ్తానని చెప్పడంతో.. తమకు ఖర్చయిన రూ.1.13 లక్షలు చెల్లిస్తేనే పాస్పోర్టు ఇచ్చి పంపిస్తామని, లేదంటే దొంగతనం కేసు పెట్టి జైలుకు పంపిస్తామని సబ్‌ఏజెంట్ బెదిరించినట్లు ఆమె తెలిపింది.

మస్కట్లో చిక్కుకున్న మహాముదా పరిస్థితిని కొందరు జర్నలిస్టుల ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కేటీఆర్ స్పందించారు. బాధితురాలిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి అయ్యే ఖర్చులను తానే భరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో మస్కట్లోని బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ అధ్యక్షుడు ఆహ్మద్ రంగంలోకి దిగారు. ఆహ్మద్, దుబాయ్ ఈటీసీఏ అధ్యక్షుడు పీచర కిరణ్ కుమార్ సమన్వయంతో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు.

మస్కట్ పోలీసుల సహకారం తీసుకుని మహాముదా ఆచూకీని గుర్తించారు. సుమారు వారం రోజులపాటు సాగిన ప్రయత్నాల అనంతరం ఆమెను సబ్‌ఏజెంట్ చెర నుంచి బయటకు తీసుకొచ్చారు. సబ్‌ఏజెంట్కు చెల్లించాల్సిన మొత్తాన్ని సమకూర్చి మహాముదాను భారత రాయబార కార్యాలయానికి తరలించారు. 

అనంతరం మంగళవారం సబ్‌ఏజెంట్ వద్ద నుంచి ఆమె పాస్పోర్టును స్వాధీనం చేసుకుని, స్వదేశానికి పంపారు. హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత మహమ్మద్ మహాముదా కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని మహాముదా భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు.