05-10-2025 12:00:00 AM
భారీగా ఆస్తి నష్టం..తప్పిన ప్రాణనష్టం
షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 4 (విజయక్రాంతి): సికిందరాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లోతుకుంటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ సైకిల్ దుకాణంలో మొదలైన మంటలు పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు వ్యాపించడంతో ఆరు దుకాణాలు పూర్తిగా కాలి బూ డిదయ్యాయి.
ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లగా, ప్రమాద సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. లోతుకుంట ప్రధా న రహదారిపై ఉన్న ఓ సైకిల్ దుకాణంలో బుధవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఉవ్వెత్తున ఎగసిపడి, పక్కనే ఉన్న కిరాణా, ఫ్యాన్సీ , ఇతర దుకాణాలకు వేగంగా వ్యాపించాయి.
దట్టమైన పొగలు, అగ్నికీలలను గమనించిన స్థానికులు భయాందోళనకు గురై వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదంలో ఆరు దుకాణాలు పూర్తిగా దగ్ధమై, వాటిలోని సరుకులు బూడిదయ్యాయి.
విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి ప్రాథమిక కారణమని అగ్నిమాపక అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి నష్టం అంచనా వేస్తున్నామని, బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుం టామని అధికారులు తెలిపారు