గ్యాంగ్‌స్టర్‌గా మారితే..

30-04-2024 12:05:00 AM

నటీనటులందరికీ ఎప్పుడో అప్పుడు ఖచ్చితంగా ఎదురయ్యే ప్రశ్న ‘ఎలాంటి పాత్రల్లో నటించాలని కలగంటున్నారు?’. ఇదే ప్రశ్నని మాళవిక మోహనన్‌పై సంధించాడు ఓ సినీ అభిమాని. సోషల్ మీడియాలో ఇటీవల అభిమానులతో మాళవిక ముచ్చటిస్తుండగా ఎదురైన ఈ ప్రశ్నకు అంతే ధీటుగా బదులిచ్చారామె. “నాకు అవకాశం వస్తే.. గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించాలని ఉంది. ఒక మహిళ గ్యాంగ్‌స్టార్ పాత్రలో కనపడటం ఎంత బావుంటుంది కదా..” అంటూ తన ఆసక్తిని కనబరిచిన మాళవిక, తాను యాక్షన్ ఘట్టాలకు ఇదివరకే శిక్షణ తీసుకున్నట్టు తెలిపారు.

విక్రమ్ కథనాయకుడిగా పా.రంజిత్ తెరకెక్కించిన చిత్రం ‘తంగలాన్’. పీరియాడిక్ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో నటించిన మాళవిక, ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు. ఆ వివరాలు కూడా పంచుకుంటూ.. “ఈ సినిమాలో అర్థం పర్థం లేని పోట్లాటలు ఉండవు. రెగ్యులర్ ఫార్ములా కాకుండా కథా బలం ఉన్న ఈ చిత్రంలోని పోరాట సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. నేనెప్పటి నుండో ఈ తరహా పాత్రల్లో నటించాలనుకుంటున్నా. ‘తంగలాన్’తో ఆ కోరిక తీరింది” అన్న మాళవిక ఇప్పడో మంచి ప్రేమ కథా చిత్రంలో నటించాలి అని ఆశ పడుతోంది. అది కూడా ఓ రకంగా నెరవేరినట్టే. ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ‘ది రాజాసాబ్’ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్న మాళవిక, ఇటీవల ఓ పాట కోసం ప్రభాస్‌తో ఆడిపాడింది. ఆ విశేషాలు తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాలి మరి!