25 August, 2026 | 1:17 AM

ఆలేరు నుంచి పోటీ చేస్తున్నా

25-08-2026 12:20 AM

యువతే రేపటి దేశ భవిష్యత్తు

సెప్టెంబర్ 17 నుంచి 14 వేల కిలోమీటర్ల పాదయాత్ర

టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న

జెన్ జీ ప్రశ్నలకు మల్లన్న సూటి సమాధానాలు

మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 24 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి బంధారపు నర్సయ్య గౌడ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు చక్రపాణి గౌడ్, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం అరుణ్ పటేల్ ఆధ్వర్యంలో సోమవారం ఈసీఐఎల్ మైదానంలో నిర్వహించిన ‘జెన్ జీ అడ్డా విత్ మల్లన్న’ కార్యక్రమంలో పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొని విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ 2028 ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించారు. ఉప్పల్ నియోజకవర్గం నుంచి టీఆర్పీ తరపున చక్రపాణి గౌ డ్ పోటీ చేస్తారని వెల్లడించారు. అలాగే సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 14 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి రాజ్యాధికారం సాధిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. నేటి రాజకీయ నాయకులు ప్రజల కంటే ఎక్కువ గా ప్రశ్నించే యువతను చూసి భయపడుతున్నారని అన్నారు.

సోషల్ మీడియా యుగంలో జనరేషన్ జెడ్ దేశ రాజకీయ దిశను మార్చగల శక్తిగా ఎదుగుతోందన్నారు. యువత ప్రశ్నించే ధైర్యం పెంచుకోవాలని, అన్యాయాలపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. విద్యా రంగంపై మాట్లాడుతూ, దేశంలోనే విద్య కోసం అత్యల్పంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగా ణ ఒకటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్య రంగాలకు కలిపి బడ్జెట్లో కనీసం 40 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

మొదటి తరగతి నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థికి పూర్తిగా ఉచిత విద్య అందించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీపై తీవ్ర విమర్శలు గుప్పించిన మల్లన్న, విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వారిపై నిరంతర పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఆర్‌టీఐ -2009 చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.

విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తన సస్పెన్షన్ వెనుక కారణాలను వివరించారు. పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థుల ఆందోళనలపై స్పందిస్తూ, సరైన మౌలిక వసతులు లేకుండా స్కిల్ ఇండియా యూనివర్సిటీ కింద విద్యాసంస్థలను విలీనం చేయడం సరైంది కాదన్నారు. విద్యార్థుల ఉద్యమాలకు తాము అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమం అనంతరం వివిధ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక మెరిట్ అవార్డులను తీన్మార్ మల్లన్న గారి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో టీఆర్పీ నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు, విద్యార్థి నాయకులు, యువత పాల్గొన్నారు.