25 August, 2026 | 3:40 AM

రైతులను ఆదుకోవాలి

25-08-2026 01:16 AM
  1. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్  
  2. సచివాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారని, వారిని తక్షణమే ఆదుకోవాలని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. సోమవారం  రాష్ట్ర సచివాలయం ఎదుట కార్యాకర్తలు, రైతులతో కలిసి రోడ్డుపై ధర్నాకు దిగారు. ఇటీవ ల కురిసిన వర్షాల ధాటికి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 6 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ఏడాది కూడా భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని, ఎకరానికి రూ. 10 వేలు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. రైతుల ఇబ్బందులును రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో చూడాలని,  గతేడాది బకాయిలతో పాటు, ఇటీవల జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే సచివాలయం వద్ద నిరసన చేపట్టానని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం  చేశారు.