30 June, 2026 | 3:19 AM

ఆర్టీసీ ఉద్యోగులు విలీనమయ్యేనా?

13-06-2024 01:49 AM

అపాయింటెడ్ డే కోసం కార్మికుల ఎదురుచూపు

కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా తీరని సమస్య

యూనియన్లు లేక మూగబోయిన కార్మికుల గొంతు

ప్రకటనలకే కొత్త బస్సులు

పని భారంలో డ్రైవర్లు, కండక్టర్లు

నేడు ఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ఎక్కువగా పోరాటం సాగించిన ఆర్టీసీ కార్మికులకు ఇప్పటికీ అనుకున్నంత న్యాయం జరగలేదు. గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం లో విలీనం చేస్తామని చెప్పినా ఎలాంటి ప్రయోజనం జరగలేదని కార్మికులు వాపోతున్నారు. యూనియన్లకు గుర్తింపు లేక తమ గళా న్ని విప్పేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని నేతలు పేర్కొంటున్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.

మహాలక్ష్మి ప్రభావంతో బస్సులు సరిపోక మహిళా ప్రయాణికులు కొట్టుకుంటున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీలో నూతనంగా నియామకాలు లేక ఇప్పుడున్నవారే కార్మికులు 16 నుంచి 18 గంటలపాటు పనిచేస్తున్నట్లు వాపోతున్నారు. కొత్త బస్సు లు లేక డొక్కు బస్సులతోనే నెట్టుకొస్తున్నట్టు చెప్తున్నారు. ఆర్టీసీ అభివృద్ధికి ఓ ఉన్నతాధికారే అడ్డంకిగా మారుతున్నారని, యూనియన్లను తొక్కేసి సర్వం ఆయనే అన్నట్లుగా వ్యవహరిస్తూ సంస్థను మరింత దిగజా రేలా చేస్తున్నారని కార్మికులు విమర్శిస్తున్నారు. ఈ తరుణంలో ఆర్టీసీపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి సమీక్షతోనైనా తమ సమస్యలు తీరుతాయని ఆర్టీసీ కార్మికులు ఆశిస్తున్నారు.

అపాయింట్‌మెంట్ డే ఎప్పుడు?

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ అసెంబ్లీలో ఓ చట్టం చేసింది. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తామని ప్రకటించారు. కానీ అపాయింట్‌మెంట్ డే ప్రకటించలేదు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేస్తామ ని ఎన్నికల ముందు కాంగ్రెస్ భరోసా ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చి ఆరేడు నెలలు గడిచినా అపాయింట్‌మెంట్ డే ప్రకటించలేదు. మహాలక్ష్మి పథకం ప్రభా వంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. నిత్యం  ప్రయాణించేవా రి సంఖ్య 55 లక్షలకు పైనే ఉంటున్నది. బస్సుల సంఖ్య మాత్రం పెరగలేదు.

ఆర్టీసీ, అద్దె బస్సులు కలిసి సుమారు 9 వేలు ఉన్నాయి. బస్సులు సరిపోక హైదరాబాద్‌లో చాలా చోట్ల సర్వీసులను రద్దు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం బస్సులు తగ్గిపోయాయి. కాలం చెల్లిన బస్సుల తో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు లు ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి ఉందని చెప్తున్నారు. మహాలక్ష్మి ప్రభావంతో టిమ్స్ యంత్రాలు కూడా సక్రమంగా పనిచేయటం లేదని కండక్టర్లు వాపోతున్నారు.

కొన్నిసార్లు రోజుకు 16 నుంచి 18 గంటలకు పైగా పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. త్వరలో 3 వేల బస్సులు కొంటున్నామని ఆర్టీసీ యాజమాన్యం చెప్తున్నా ఇప్పటికీ వాస్తవరూపం దాల్చలేదు. మహాలక్ష్మి పథకానికి సంబంధించి నెలకు సుమారు రూ.350 కోట్లు ప్రభుత్వం క్రమం తప్పకుండా చెల్లించి సంస్థను ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు. చాలాకాలంగా ఆర్టీసీలో నియామకాలు జరగలేదని, అందుకే పనిభారం పెరిగిపోయిందని అంటున్నారు. వెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 

బస్ భవన్‌లో తిష్టవేసిన వారిని తొలగించండి

ఆర్టీసీలో కష్టపడి పనిచేసే కార్మికుల కంటే ఏం చేయకపోయినా పెద్దపెద్ద వేతనాలతో అనేక మంది ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తూ సంస్థకు భారంగా మారారని కార్మికులు వాపోతున్నారు. పైరవీలు చేసుకొని బస్ భవన్‌లో కన్సల్టెంట్ల పేరుతో సుమారు 120 మంది అత్యధిక వేతనాలతో పనిచేస్తున్నారని, వారి వల్ల సంస్థ లక్షల రూపాయలు కోల్పోతోందని ఆరోపిస్తున్నారు. తెల్ల ఏనుగుల్లాంటి వారిని సంస్థ వదలించుకుంటే నష్టాలు కొద్దిమేర అయినా తగ్గుతాయని చెప్తున్నారు. కన్సల్టెంట్ల పేరుపై బస్ భవన్‌లో తిష్ఠ వేసిన వారిని తొలగించాలని, ఇందుకు మంత్రి చొరవ తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. 

విభజన సమస్యలపైనా దృష్టి పెట్టాలి

ఏపీ ప్రభుత్వం తమకు ఆర్టీసీ ఆస్తుల్లో వాటా వస్తుందని చెప్తూనే ఉన్నది. ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు ఇంకా బస్ భవన్‌లో 50 శాతం తమ అధీనంలోనే ఉంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై సర్కారు ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంది. అలాగే అంతర్‌రాష్ట్ర ఒప్పందాలను కూడా పూర్తి చేస్తే ఇతర రాష్ట్రాలకు మరిన్ని బస్సులను నడిపేందుకు అవకాశం ఉంటుందని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు.