నకిలీ నోట్లు అంటకట్టిన వ్యక్తి అరెస్టు
పరారీలో మరోకరు
నల్లగొండ టౌన్, ఏప్రిల్ 9(విజయక్రాంతి): లక్ష అసలు కరెన్సీ ఇస్తే అదే తరహాలో ఐదు లక్షల నగదు ఇస్తామని చెప్పి మోసగించిన ఓ వ్యక్తిని నల్లగొండ జిల్లా తిప్పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గురువారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు.పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశం నుంచి భారతదేశానికి వచ్చిన సాంగోల్ కొంతకాలం బెంగళూరులో నివసిస్తూ పండ్లు, ఇతర వస్తువులు విక్రయిస్తూ జీవన కొనసాగిస్తున్నాడు. వాట్సాప్ ద్వారా ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని సులభంగా డబ్బు సంపాదించే విషయమై నకిలీ కరెన్సీ నోట్ల మోసాలకు పాల్పడ్డాడన్నారు.
హైదరాబాద్ టోలిచౌకిలో ఉంటూ నకిలీ కరెన్సీని అంటగడుతూ మోసాలకు పాల్పడుతున్నడన్నారు. తిప్పర్తి మండలం మల్లేపల్లివారిగూడెం డాబా వద్ద జానయ్య నుంచి లక్ష అసలు కరెన్సీ తీసుకొని రూ.5 లక్షలు ఇస్తున్నానని రంగుల కాగితాలు 500 నోట్లను పోలిన నకిలీ నోట్లు అంటగట్టాడన్నారు.ఇంటికి వెళ్లి చూసుకున్న జానయ్య మోసపోయానని గమనించి తన స్నేహితుడైన అంబేద్కర్ ద్వారా సాంగోల్‌ను రప్పించి పోలీసులకు పట్టించారు.




