28 August, 2026 | 4:15 AM

మూగజీవాలపై వ్యక్తి దౌర్జన్యం!

28-08-2026 12:06 AM

కర్రతో దాడి.. గర్భధార గొర్రెల మృతి

న్యాయం కోసం మీడియాను 

ఆశ్రయించిన గొర్రెల కాపరులు

నాగర్ కర్నూల్ ఆగస్టు 27 (విజయక్రాంతి) :  తన పొలం మీదుగా గొర్రెల మంద వెళ్తుందని అహంకారంతో ఒక వ్యక్తి మానవత్వాన్ని మరిచి గొర్రెల మందపై కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో గర్భం దాల్చి ఉన్న రెండు గొర్రెలు తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో మృతి చెందాయి. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో ముందు గురువారం చోటుచేసుకుంది.

బిజినపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన  పాశం నాగయ్య తన గొర్రెల మందను మేపుకుంటూ బస్ డిపో పరిధిలోని ఖాళీ ప్లాట్ల మీదుగా వెళ్తున్న క్రమంలో ఫ్లాట్ల యజమాని పొడవాటి కర్రతో గొర్రెల మందపై దాడి చేసినట్లు ఆరోపించాడు. పరుష పదజాలంతో దూషిస్తూ వారిపై కూడా దాడికి యత్నించాడని ఆరోపించారు. నాగర్ కర్నూల్ మండలం బొందలపల్లి గ్రామానికి చెందిన యాదవులపై గతంలో దాడి చేసిన ఘటనలో ఆ వ్యక్తిపై ఇప్పటికే కేసులు నమోదు అయ్యి ఉన్నాయని సదరు వ్యక్తి ఇతరులపై కూడా తీవ్ర పదజాలంతో దూషిస్తూ రాజకీయ, ధన బలంతో రౌడీయిజం చలాయిస్తుంటాడని స్థానికులు ఆరోపించారు.