ఐస్‌క్రీంలో మనిషి వేలు
ముంబై వ్యక్తికి భయానక అనుభవం
ముంబై, జూన్ 13: ముంబైలో ఓ వైద్యుడికి భయాకన అనుభవం ఎదురైంది. డాక్టర్ ఓర్లెమ్ బ్రాండన్ సెర్రావ్ ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీం కొనుక్కొంటే అందులో మనిషి వేలు బయటపడింది. ఆయన ఐస్‌క్రీం తింటుండగా, నోట్లో గట్టిగా తగలటంతో ఏదో ఇంగి అనుకొన్నాడట. తీరా సరిగ్గా గమనిస్తే అది మనిషి వేలు అని తేలింది. దీంతో ఆ వైద్యుడికి మూర్చ వచ్చినంత పనైంది. ఆ ఐస్‌క్రీం ఫొటోను ఆయన సోషల్‌మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ‘ఓ యాప్‌లో నేను మూడు కోన్ ఐస్‌క్రీంలకు ఆర్డర్ ఇచ్చాను. అందులో ఒకటి యుమ్మో బ్రాండ్‌కు చెందిన బటర్‌స్కాచ్ ఐస్‌క్రీం. ఆ ఐఎస్‌క్రీంను సగం తిన్న తర్వాత నోట్లో ఏదో గట్టిగా తగిలింది. అది ఏదో గింజ అనుకొని నోట్లో నుంచి బయటకు తీసి చూశాను. జాగ్రత్తగా గమనిస్తే అది మనిషి వేలు అని తేలింది. నేను ఒక వైద్యుడిని. శరీర భాగాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఆ వేలుకు గోరుతోపాటు వేలిముద్రలు కూడా ఉన్నాయి. దీంతో నేను మూర్చపోయాను’ అని ఆ వైద్యుడు చెప్పుకొచ్చాడు.






