08-11-2025 09:09:38 PM
పెద్దపల్లి జిల్లా రంగాపూర్ గ్రామంలో విచిత్ర ఘటన..
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రంగాపూర్ గ్రామంలో శనివారం ఊహించని విచిత్ర సంఘటన గ్రామస్తులను సంప్రమాశ్చర్యాలకు గురిచేసింది. చనిపోయాడని భావించి మరచిపోయిన వ్యక్తి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చాడు. రంగాపూర్ గ్రామానికి చెందిన వెంకట రాములు అనే వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా మనస్థాపనతో 12 సంవత్సరాల క్రితం ఎక్కడికో వెళ్లిపోయాడు. కొద్ది రోజులపాటు కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం ఎక్కడ తిరిగినా కూడా ఆచూకీ లభించలేదు.
అలా రోజులు గడిచిపోయాయి. ఎప్పటికైనా తిరిగి వస్తాడన్న ఆశలు కూడా సన్నగిల్లిపోయాయి. రోజులు కాదు సంవత్సరాలు గడిచిన వెంకట రాములు ఆచూకీ తెలియకపోవడంతో ఇక కుటుంబ సభ్యులు ఎక్కడో చనిపోయాడని భావించారు. కొంతకాలం పాటు అతన్నే తలుచుకొని గడిపారు. కాలక్రమమైన ఏండ్లు గడవడంతో ఇక వెంకట రాములు ని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సైతం మరచిపోయారు. అసలు ఉన్నాడా లేడా అన్నది కూడా పట్టించుకోవడమే.
కానీ విధి విచిత్రమైనది అని మరోసారి రుజువు అయింది. చనిపోయాడు అనుకున్నా వెంకట రాములు 12 సంవత్సరాల తర్వాత అస్సాం రాష్ట్రం నుండి నేరుగా రంగాపూర్ గ్రామంలోని తన ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా నోట మాట రాక ఆశ్చర్యపోయారు. తర్వాత ఊపిరి పీల్చుకొని ఎలాగైతేనేం ఇన్నాళ్లకు సజీవంగా ఇంటికి వచ్చాడు అదే చాలు అనుకొని అతనితో ఆనందంగా గడిపారు.