6 June, 2026 | 1:43 AM

సారూ.. ఇందిరమ్మ బిల్లు ఇప్పించరా..

06-06-2026 12:00 AM

పీడీ సారు.. బాగా తిప్పలు పెడుతున్నడు..

పట్టించుకోని మండల అధికారులు..

మేము అమాయక పేదలం..

తాడ్వాయి, జూన్ 5 (విజయక్రాంతి): సారూ.. ఇందిరమ్మ పథకంలో ఇల్లు నిర్మించుకుంటున్నాం.... మీరు ఇందిరమ్మ పథకంలో ఇల్లు కట్టుకోమంటేనే కట్టుకుంటున్నాం...... మాకు సాంక్షన్ రాలేదు సారు... మేము ప్రమాద స్థితిలో ఉన్న పెంకుటింట్లోనే నివాసముంటున్నాం. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా సారు అని అడిగితే మీరు వెంటనే సాంక్షన్ చేస్తున్నానని సాంక్షన్ చేశారు. సారు మేము అక్కడ ఇక్కడ పుట్టిన చోటల్లా అప్పులు చేసి ఇల్లు నిర్మించుకుంటున్నాం మాకు బిల్లులు ఇవ్వమంటే అధికారులు బిల్లులు ఇవ్వడం లేదు.

తిప్పలు పెడుతున్నరు. మీ దగ్గరకు మేము ఎన్నిసార్లు వచ్చినా మాకు మీరు వెంటనే స్పందించి దరఖాస్తుపై సంతకం చేసి పీడి సార్ దగ్గరికి వెళ్ళమంటిరి అంటూ ఇందిరమ్మ బాధితులు కలెక్టర్ సార్ తో మొర పెట్టుకుంటున్నారు. మా ఇందిరమ్మ ఇల్లు బిల్లు డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలోని ఓ బాధితురాలి ఆవేదన ఇది.గ్రామానికి చెందిన బక్క బాల్ రాజవ్వ అనే బాధితురాలు పేదరికంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

పెంకుటిల్లు ప్రమాద స్థితిలో ఉన్న డబ్బుల్లేక కూల్చుకోలేదు. అదే ఇంట్లో జీవనం సాగిద్దామని అనుకున్నది. కానీ ఆ కుటుంబం అదృష్టం కొద్ది గ్రామానికి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన కోసం వచ్చారు. అప్పుడే అక్కడున్న గ్రామానికి చెందిన పెద్దోళ్ల సువాసిని, బక్క బాల్ రాజవ్వ, కర్రోళ్ల పుష్ప లు మాకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాలేదు మీరు మంజూరు చేస్తే ఇండ్లు నిర్మించుకుంటామని కలెక్టర్ తో మొరపెట్టుకున్నారు.

వెంటనే స్పందించిన కలెక్టర్ ముగ్గురికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన ముగ్గురు బాధితులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. పేదరికంలో ఉన్న కుటుంబాలు అవడంతో అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఇండ్ల నిర్మాణం చేపట్టారు. అందులో పెద్దోళ్ల సువాసిని, కర్రోళ్ళ పుష్పలకు ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు మంజూరయ్యాయి. కానీ బక్క బాల్ రాజవ్వ అనే బాధితురాలికి మాత్రం ఇంద్రమ్మ ఇల్లు బిల్లులు రావడం లేదు. మీది మంజూరులో లేదు, అంటూ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

- - పీడి సారు పట్టించుకోవడం లేదు...

- - మేము ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం కలెక్టర్ కార్యాలయానికి చాలా సార్లు వెళ్ళాం. అక్కడ కలెక్టర్ సారును కలవగానే వెంటనే స్పందించి మేము తీసుకువెళ్లిన దరఖాస్తు పై సంతకం చేసి పిడి దగ్గరికి పంపేవాడు. ఎప్పుడు వెళ్లిన సారు స్పందించేవాడు. కానీ పీడి మాత్రం మా దరఖాస్తును ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

మేము గత నాలుగు నెలలుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ, మండల కార్యాలయం చుట్టూ, గ్రామపంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, అయినా ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోవడంలేదని బక్క బాలరాజువ్వ, నర్సయ్య దంపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు సారు ఇల్లు మంజూరు చేస్తున్నానని ప్రకటిస్తేనే ఇల్లు మొదలుపెట్టాం, కానీ అధికారులు తిరకాసు చేస్తూ మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మేము ఏమి చేయాలో అర్థం కావడం లేదు.

అప్పులు చేసి ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నాం...

- - మా దగ్గర డబ్బులు లేవు. సారు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగానే పుట్టిన చోటల్లా అప్పులు చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్నాం. ఇప్పటివరకు స్లాబు లెవెల్ వరకు గోడలు కట్టుకున్నాం.అయినా అధికారులు బిల్లులు ఇవ్వడం లేదు. పిడి సార్ ఏ మాత్రం స్పందించడం లేదు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మీకు గతంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది అంటున్నారు.. 

మీకు గతంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. అందుకోసమే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రాదు అని అధికారులు చెబుతున్నారు.మేము గతంలో ఎప్పుడు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోలేదు. మాకు ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు లేదు. అని బాధితులు చెబుతున్నారు.మీరు విచారణ చేసి మాకు ఒకవేళ గతంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినట్లయితే బిల్లులు నిలిపివేసిన సరే అని బాధితులు వాపోతున్నారు.

రేకుల షెడ్ లో నివాసం..

- - ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందనే సంతోషంలో ఉన్న పాత ఇల్లు కూల్చి వేసుకున్నారు. ప్రస్తుతం ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో రేకుల షెడ్ వేసుకొని నివాసం ఉంటున్నారు. వర్షాకాలం వస్తే ఆ రేకుల షెడ్డులో మేము ఎలా ఉండాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు వెంటనే ఇందిరమ్మ బిల్లులు ఇప్పించాలి అంటూ బాధితులు బోరుమంటున్నారు.