పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు
578 మార్కులతో సత్తా చాటిన శ్రీమతి సీతా మెమోరియల్ స్కూల్ విద్యార్థిని వర్షిణి
561 మార్కులు సాధించిన దొండపాడు ప్రభుత్వ పాఠశాల చెందిన దానవత్ భవానీ
హుజూర్ నగర్/చింతలపాలెం, ఏప్రిల్ 29, విజయక్రాంతి: ఎస్ ఎస్ సి ఫలితాలలో చింతలపాలెం మండల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మండల వ్యాప్తంగా మొత్తం 244 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 240 మంది ఉత్తీర్ణత సాధించి 98.36 శాతం ఫలితాలను నమోదు చేశారు. మండల స్థాయిలో టాపర్లుగా ఏ. వర్షిణి (578), బి. సంజన (574), ఎం. ప్రవణి (574), ఏ. వాసు నాయక్ (573), ఆర్. భవజ (568) నిలిచారు.
మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు కూడా విశేష ఫలితాలను సాధించాయి. మొత్తం 108 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 104 మంది ఉత్తీర్ణత సాధించి 96.30 శాతం ఫలితాలను నమోదు చేశారు. జడ్పీహెచ్‌ఎస్ వెంకటనరసింహాపురం, కేజీబీవీ చింతలపాలెం పాఠశాలలు 100 శాతం ఫలితాలతో ప్రత్యేక గుర్తింపు పొందాయి. జడ్పీహెచ్‌ఎస్ చింతలపాలెం 97.37 శాతం, జడ్పీహెచ్‌ఎస్ తమ్మవరం 87.50 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో దానవత్ భవానీ (జడ్పీహెచ్‌ఎస్ వెంకటనరసింహాపురం) ఇంగ్లీష్ మీడియం 561 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. అనంతరం డి. శ్రావ్య తెలుగు మీడియం (525), మునగ కావ్య (522), వేదమల్లిక (521) ప్రతిభ చాటారు. ప్రైవేటు పాఠశాలలు అరుణోదయ హైస్కూల్, కేరళ ప్రైమరీ స్కూల్, ఎస్.ఎం.టి సీతా మెమొరీయల్, డి.ఏ.వి శ్రీ విష్ణు విద్యానికేతన్, సెయింట్ ఆన్స్ హైస్కూల్ పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణతతో సత్తా చాటాయి.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రతిభ కనబరిచారు. ఉపాధ్యాయుల కృషి, మెరుగైన వసతులు, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ స్థాయి విజయాలు సాధ్యమయ్యాయని మండల విద్యాధికారి నారపరాజు శ్రీనివాస్ అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మండల ప్రజలు, అధికారులు అభినందించారు.






