24 July, 2026 | 12:01 PM

మంథనిలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

24-07-2026 10:57 AM

రూ.43,540 నగదు, 52 పేకముక్కలు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం, నలుగురు అరెస్టు

మంథని, జూలై 24(విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనర్(Ramagundam Police Commissioner) ఆదేశాల మేరకు నేరాల నియంత్రణలో భాగంగా టాస్క్‌ఫోర్స్/నార్కోటిక్ బృందం మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంజపడుగు గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆకస్మికంగా దాడి చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు నగదును పందెంగా పెట్టుకుని మూడు ముక్కల పేకాట ఆడుతున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

దాడిలో నిందితుల వద్ద నుంచి రూ.43,540 నగదు, 52 పేకముక్కలు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పోలీసులను గమనించి అక్కడి నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదు, పేకముక్కలు, మొబైల్ ఫోన్లతో పాటు తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మంథని పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. నేరాల నియంత్రణలో భాగంగా జిల్లాలో పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.