25-05-2025 09:35:21 PM
మహాసభలతో సీపీఐ పార్టీ పునర్నిర్మాణం..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణి శంకర్..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): దేశంలో అసమానతలు ఉన్నంతకాలం ఎర్రజెండా పోరాటాలు, మావోయిస్టులు ఉంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణి శంకర్(Kalaveni Shankar) అన్నారు. సీపీఐ కార్యాలయంలో ఆదివారం జరిగిన సీపీఐ పార్టీ 21వ పట్టణ మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ మహిళా సమాఖ్య సీనియర్ రాష్ట్ర నాయకురాలు గుండా సరోజన ఎర్ర జెండాను ఆవిష్కరించారు. ఈ మహాసభలకు టౌన్ పార్టీ సెక్రెటరీ ఆడెపు రాజమౌళి అధ్యక్షత వహించారు. మహాసభలకు ముఖ్యాతిదిగా హాజరైన కలవేణి శంకర్ మాట్లాడుతూ... సామ్రాజ్య వాదుల చెప్పు చేతుల్లో దేశాన్ని పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా లు మతోన్మాద విధానాలు అవలంభావిస్తున్నారని తెలిపారు.
కగార్ పేరుతో మధ్య భారతదేశంలో మావోయిస్ట్ పార్టీ, ఆదివాసి గిరిజనులపై యుద్ధం చేస్తూ వేలాదిమంది గిరిజనులను, వందలాదిమంది మావోయిస్ట్ లను కాల్చి చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజును పట్టుకొని కాల్చి చంపి నమోదీ, అమిత్షాలు సంబరాలు చేసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీకి విప్లవోద్యమాలకు పుట్టినిల్లయిన బెల్లంపల్లి పట్టణం పార్టీ మహాసభలు జరగడం అభినందనీయమన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ మహాసభలకు పార్టీ సన్నద్ధమౌతుందన్నారు.
సీపీఐ పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు గడుస్తున్నాయని ప్రజా, కార్మిక పోరాటాలు చేసి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మహాసభల ద్వారా దేశంలో సీపీఐ పునర్నిర్మాణానికి దోహదపడతాయన్నారు. ఈ మహాసభల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, బొల్లం పూర్ణిమ, రేగొండ చంద్ర శేఖర్,రాష్ట్ర సీనియర్ నాయకుడు చిప్ప నర్సయ్య, నాయకులు డీ ఆర్ శ్రీధర్, బొంతల లక్ష్మీనారాయణ, అక్కేపల్లి బాపు, మేకల రాజేశం, సీపీఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.