27 May, 2026 | 12:58 AM

మావోయిస్టు నరహరి లొంగుబాటు

27-05-2026 12:00 AM
  1. భార్య దానమ్మతో కలిసి సరెండర్
  2. ఈ లొంగుబాటు మావోయిస్టులకు ఎదురుదెబ్బ: డీజీపీ సీవీ ఆనంద్ 
  3. ముగిసిన పసునూరి 40 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం 

మహబూబాబాద్, మే 26 (విజయక్రాంతి): మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి భార్య దానమ్మతో కలిసి మంగళవారం పోలీసులకు లొంగిపోయినట్టు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నరహరి లొంగుబాటుతో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలిందని డీజీపీ పేర్కొ న్నారు.

ఆయనపై రూ.25 లక్షల రూపాయల రివా ర్డు ఉన్నట్టు ప్రకటించారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలని, తెలంగాణకు చెందిన ముగ్గురు నేతలు గణపతి, జాడే సుజాత, వార్త శేఖర్ మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం సాయమందిస్తోందని తెలిపారు. నరహరి లొంగుబాటుతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఒక్కరి ద్దరూ అజ్ఞాత మావోయిస్టు నేతలు మినహా మిగిలిన అంతా లొంగిపోయినట్లేనని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన సునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్ తెలంగాణకు చెందిన కీలక మావోయిస్టు నేతగా గుర్తింపు పొందారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. 1962లో సోమిడి గ్రామంలో జన్మించిన నరహరి వరంగల్ ఎల్బీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో 1982లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ ద్వారా పీపుల్స్ వార్ నక్సలైట్ ఉద్యమంలో చేరాడు.

ఆ తర్వాత మావోయిస్టు పార్టీలో పలు బాధ్యతలు నిర్వహిస్తూ బీహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో పనిచేశారు. అంచలంచెలుగా ఎదుగుతూ 2017లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా పార్టీలో కీలక పాత్ర పోషించారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధ సంపత్తి నిర్వహణ బాధ్యతల్లో ఆయన చురుకైన పాత్ర వహించాడు. నరహరి విశ్వనాథ్, శంకర్, జగదీశ్వర్, సంతోష్ వంటి మారుపేర్లతో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్వహించాడు.

సాంకేతిక, సంస్థాగత బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తి స్తూనే.. ఆయుధాల ఉత్పత్తి, మరమ్మతు, నిర్వహణకు సంబంధించి మావోయిస్టు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేవారు. తెలుగు, హిందీ, భోజ్‌పురి భాషల్లో ప్రావీణ్యం కలిగిన ఆయన ఉత్తర భారత రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను సమన్వయం కీలక పాత్ర పోషించాడు. ఇటీవల కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నరహరి, తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు.