‘మార్కో’ రుద్రరూపం
మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మార్కో’. ముకుందన్ ఇంతకుముందు ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’, ‘కిలాడి’, ‘యశోద’, ‘మాలికాపురం’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ‘మార్కో’లో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ జానర్‌లో రానున్న ఈ సినిమాకు ‘మైఖేల్’, ‘ది గ్రేట్ ఫాదర్’ ఫేమ్ హనీఫ్ అదేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది.
తాజాగా మేకర్స్ ఫస్ట్‌లుక్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ఈ సినిమా ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానుండగా, ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. తెలుగు, తమిళ, మళయాల తదితర భాషల్లో రానున్న ఈ సినిమాను క్యూబ్స్ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై షరీఫ్ మహ్మద్ అబ్దుల్ గదాఫ్ నిర్మిస్తుండగా, ‘ప్రేమమ్’ సినిమాలో కథానాయకుడిగా నటించిన నివిన్ పాలీ ‘మార్కో’లో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ‘కేజీఎఫ్’ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వహిస్తున్నారు.






