సైకాలజీ చదువుతున్నా..
కొంతమంది నటులు పాత్రల పేరుతో బాగా గుర్తుండిపోతారు. ఆ కోవలోకే వస్తుంది కథానాయిక కృతిశెట్టి. ‘ఉప్పెన’ సినిమాతో బేబమ్మగా ప్రేక్షకులకు చేరువైన ఆమె తొలి సినిమాతోనే భారీ విజయం అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూలు చేసిన విషయం తెలిసిందే. అప్పటికి ఆమె వయసు పదిహేడేళ్లు. ఊహించని ఈ విజయం గురించి “అంతపెద్ద హిట్ అవుతుందనుకోలేదు” అంటూ గత స్మృతులను నెమరువేసుకున్న కృతి “ఒక వైపు చదువు సాగిస్తూనే మరోవైపు మోడలింగ్ మొదలుపెట్టా.
ఆ క్రమంలో ‘ఉప్పెన’ బృందం నుండి పిలుపు అందింది. సినిమా చేస్తున్న సమయంలో పోస్టర్ విడుదల కాగానే, వరుసగా అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అలా నా సినీ ప్రయాణం మొదలైందని” చెప్పుకొచ్చింది. మరికొన్ని విషయాలను జతపరుస్తూ “డాక్టర్ కావాలనుకున్నా.. సినిమాల మూలంగా అది కుదరక, ఇప్పుడు సైకాలజీ చదువుతున్నా” అని తెలిపిన కృతి ఇటీవల విడుదలైన ‘మనమే’ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తద్వారా తనకు నటిగా గుర్తింపునిచ్చిన తెలుగు సినిమాతో ఈ ఏడాది తొలి విజయం పొందిన కృతి, తాను నటించిన తమిళ, మలయాళ చిత్రాలతో త్వరలో అక్కడి ప్రేక్షకులను అలరించనుంది.






