30 May, 2026 | 1:48 AM

గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

30-05-2026 12:00 AM

ఇద్దరు అరెస్ట్, రూ.18 లక్షల..

విలువైన గంజాయి స్వాధీనం..

సికింద్రాబాద్, మే29 (విజయక్రాంతి): సికింద్రాబాద్ రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్  సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని సంబల్పూర్ నుంచి కర్ణాటకలోని వాడికి గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 36.374 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.18,18,700 ఉంటుందని పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహారాష్ట్రకు చెందిన సుధాంశు కుమార్ (22) మరియు బీహార్కు చెందిన సుమన్ కుమార్ (28) అనే ఇద్దరు నిందితులు గంజాయి రవాణాలో పాల్గొన్నారు. సుధాంశు కుమార్ పుణెలోని బార్క్లేస్ సాఫ్ట్వేర్ కంపెనీలో డేటా ఇంజనీర్గా పనిచేస్తుండగా, సుమన్ కుమార్ బీహార్లో కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు.

ప్రధాన నిందితులు రోహిత్ సాని గోరఖే, అభయ్ అనే వ్యక్తులు ఒడిశా నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పుణెలో వీరితో పరిచయం ఏర్పడిన సుధాంశు కుమార్, సుమన్ కుమార్లకు ఒక్కో ట్రిప్కు రూ.10 వేల పారితోషికం ఇస్తామని ఆశ చూపించి అక్రమ రవాణాలో భాగస్వాములను చేశారు.ఈ నెల 25న రోహిత్ గంజాయితో నిండిన ట్రాలీ సూట్కేస్ను సుధాంశు కుమార్కు, బ్యాక్ప్యాక్ను సుమన్ కుమార్కు అప్పగించాడు.

అనంతరం వీరంతా నాగావళి ఎక్స్ప్రెస్లో ఎక్కి ప్రయాణం ప్రారంభించారు. అయితే చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని గుర్తించిన ఇద్దరు నిందితులు రైలులో నుంచి దిగిపోయి అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం రెండు రోజుల పాటు ఓ లాడ్జ్లో తలదాచుకుని, తిరిగి భవ్నగర్ ఎక్స్ప్రెస్ ద్వారా వాడికి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు.

సికింద్రాబాద్ స్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా,వారి వద్ద గంజాయి ఉన్నట్లు అంగీకరించారు. వెంటనే ట్రాలీ బ్యాగ్, బ్యాక్ప్యాక్లను తనిఖీ చేసి మొత్తం 36.374 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు రోహిత్ మరియు అభయ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించిన సికింద్రాబాద్ సి ఆర్ పి, ఆర్పిఎఫ్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినంది స్తూ, పాల్గొన్న అధికారులకు ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.