సైబరాబాద్‌లో రూ. 1500 కోట్ల భూ కుంభకోణం బట్టబయలు
వైకాపా మాజీ ఎమ్మెల్యేపై కేసు, ముగ్గురు అరెస్ట్!
శేరిలింగంపల్లి, మే29 (విజయక్రాంతి): భాగ్యనగర శివార్లలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో భారీ భూ కుంభకోణం వెలుగుచూసింది. నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) సృష్టించి, సుమారు రూ. 1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేయడానికి ప్రయత్నించిన ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఈ భారీ ల్యాండ్ గ్రాబింగ్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వైరిచర్ల (వైకాపా) మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాజేంద్రనగర్ నియోజకవర్గం, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిపేట్ గ్రామం సర్వే నంబర్ 18లో సుమారు 10 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. ప్రస్తుతం మార్కెట్ విలువల ప్రకారం ఈ భూమి ధర రూ. 1500 కోట్లకు పైమాటే. ఈ భూమిపై హక్కుల కోసం నిమ్మల వేణుగోపాల్, నిమ్మల రామస్వామి, నిమ్మల రాజేష్ గౌడ్ (దివంగత దశరథ్ కుటుంబ సభ్యులు) గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే, వీరు దాఖలు చేసిన పిటిషన్లను 2025 అక్టోబర్లోనే హైకోర్టు కొట్టివేసింది. కోర్టులో చుక్కెదురైనప్పటికీ, ఎలాగైనా ఆ భూమిని చేజిక్కించుకోవాలని నిందితులు అడ్డదారి తొక్కారు.
నకిలీ జీవోల సృష్టి.. మాజీ ఎమ్మెల్యే హస్తం!
ప్రభుత్వం ఈ భూమిని క్రమబద్ధీకరించిందంటూ నిందితులు ఏకంగా ఐదు నకిలీ జీవోలను (G.O.Ms.No.558, 553, 555, 554, 552) సృష్టించారు. ఈ ఫేక్ ఆర్డర్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ నమ్మబలికారు. ఈ కుట్రలో వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేశ్, సునీల్, రాధాకృష్ణలు చేతులు కలిపారు. ఇంతటి భారీ విలువైన భూమిని ఎకరాకు కేవలం రూ. 3.5 కోట్ల చొప్పున తక్కువ ధరకే విక్రయించేందుకు ముఠాగా ఏర్పడి ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో భాగంగానే అవతలి పార్టీ (సెకండ్ పార్టీ) నుంచి సుమారు రూ. 4 కోట్ల అడ్వాన్స్ కూడా వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
తహసీల్దార్ అలర్ట్.. రంగంలోకి పోలీసులు
సోషల్ మీడియాలో ఈ నకిలీ జీవోలు చక్కర్లు కొడుతుండటాన్ని గండిపేట్ తహసీల్దార్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమై గత వారం (23.05.2026న) నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి నకిలీ పత్రాలు, బ్యాంక్ పాస్బుక్స్, కీలక అవగాహన ఒప్పందాలు (MoUs), ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురి అరెస్ట్.. మాజీ ఎమ్మెల్యే పరారీ!
ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు శుక్రవారం (మే 29) నాడు ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు: నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయి కిరణ్. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనా యుడు, బొల్లా రమేశ్ సహా మరికొందరు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
నలుగురు డీసీపీల పర్యవేక్షణలో విచారణ
ఈ కుంభకోణం యొక్క తీవ్రతను దృష్ట్యా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ ఐపిఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. డీసీపీలు చెన్నకేశవులు, ముత్యం రెడ్డి, సాయి మనోహర్, ఉదయ్ రెడ్డిల ప్రత్యక్ష పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఈ స్కామ్లో ఇంకా ఎవరైనా రెవెన్యూ అధికారులు లేదా పెద్దల హస్తం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.
పోలీసుల హెచ్చరిక....
గండిపేట్, కోకాపేట్ వంటి హై-డిమాండ్ ఏరియాల్లో భూములు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆయా భూములకు సంబంధించిన జీవోలు, ధృవీకరణ పత్రాలను అధికారిక ప్రభుత్వ వ్బుసైట్లు లేదా ధరణి పోర్టల్ ద్వారా, సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో స్వయంగా సరిచూసుకున్న తర్వాతే లావాదేవీలు జరపాలని స్పష్టం చేశారు.






