8 July, 2026 | 4:37 AM

ఎన్నికల ఫలితాల తర్వాత మార్కెట్ జూమ్

14-05-2024 12:45 AM

జూన్ 4లోగా షేర్లు కొనండి

ఇన్వెస్టర్లకు అమిత్‌షా టిప్

న్యూఢిల్లీ, మే 13: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గడంతో స్టాక్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు పతనమవుతున్న నేపథ్యంలో ఈ కనిష్టధరలో షేర్లను కొనుగోలు చేయాలంటూ ఇన్వెస్టర్లకు కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా సిఫార్సుచేశారు.  నాల్గవ దశ పోలింగ్ రోజైన సోమవారం ఆయన ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ ‘ఇంతకంటే  పెద్ద పతనాల్ని మార్కెట్ చవిచూసింది. దీనిని (ప్రస్తుత క్షీణతను) ఎన్నికలతో ముడిపెట్టరాదు. ఏదిఏమైనా పుకార్లు వ్యాపిస్తూ ఉంటాయి. మీరు జూన్‌లోపున కొనండి. అటుతర్వాత మార్కెట్ దూసుకెళ్తుంది’ అనిచెప్పారు.

ఫలితాల తర్వాత మార్కెట్ కొత్త గరిష్ఠస్థాయికి చేరుతుందా? అన్న ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ తాను స్టాక్ మార్కెట్‌ను విశ్లేషించలేనని, కానీ సాధారణంగా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడినపుడు మార్కెట్ పెరుగుతుందన్నారు. ఈ దఫా తమకు 400 లోక్‌సభ స్థానాలకు పైగా వస్తాయని, స్థిరమైన మోది ప్రభుత్వం మళ్లీ వస్తుందన్నారు. అందుచేత మార్కెట్  తప్పనిసరిగా పెరుగుతుందన్నారు.