8 July, 2026 | 5:43 AM

దిగిన రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 4.83 శాతం

14-05-2024 12:44 AM

న్యూఢిల్లీ, మే 13: ఇంధన, విద్యుత్ ధరలు తగ్గడంతో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం నెమ్మదించింది. ఈ ఏడాది మార్చి నెలలో 4.85 శాతంగా నమోదైన వినిమయ ధరల సూచి (సీపీఐ) ఏప్రిల్ నెలలో 4.83 శాతానికి తగ్గినట్టు జాతీయ గణాంకాల శాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అయితే ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 8.52 శాతం నుంచి 8.70 శాతానికి చేరింది.  ఏప్రిల్ నెలలో గ్రుడ్లు, మాంసం, మసాలా దినుసులు తృణధాన్యాల ధరలు తగ్గగా, పండ్లు, కూరగాయలు, పప్పు దినుసుల ధరలు పెరిగాయి. ఇంధనం, విద్యుత్ విభాగపు ద్రవ్యోల్బణం 4.24 శాతానికి తగ్గింది. 

రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి అదుపు చేయాలని రిజర్వ్‌బ్యాంక్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఆర్బీఐ తన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు రిటైల్ ద్రవ్యోల్బణంపైన ఆధారపడుతుంది. తాజా గణాంకాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 4.11 శాతానికి తగ్గగా, గ్రామీణ ప్రాంతాల్లో 5.43 శాతానికి పెరిగింది. ఒడిస్సాలో అత్యధికంగా 7.11 శాతం ద్రవ్యోల్బణం నమోదు కాగా, అత్యల్ప ద్రవ్యోల్బణం ఢిల్లీలో 2.17 శాతం వద్ద నిలిచింది.

జాతీయ సగటుకన్నా అధిక ద్రవ్యోల్బణం ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, అసోం, బీహార్, చత్తీస్‌ఘర్, హర్యానా, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్‌ల్లో నమోదయ్యింది. ఇంధనం, విద్యుత్ విభాగాల ద్రవ్యోల్బణం తగ్గడంతోనే మొత్తంగా సీపీఐ నెమ్మదించిందని, వస్త్రాలు, పాదరక్షలు, పాన్, టొబాకో ధరల తగ్గుదల కూడా ఇందుకు కారణమని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ చెప్పా రు. అయితే కూరగాయలు, పప్పుదినుసుల విభాగంలో ద్రవ్యోల్బణం కొద్ది నెలలుగా రెండంకెల్లో కొనసాగుతున్నదన్నారు.