గురుపౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యానం
చిట్యాల,(విజయక్రాంతి): గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన సత్సంగం భక్తిశ్రద్ధలతో నిర్వహించగా, మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్ ముఖ్య అతిథిగా బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గురువుల ఆశీస్సులు మన జీవితానికి దిశానిర్దేశం చేస్తాయని, ధ్యానం ద్వారా మనస్సుకు ప్రశాంతత, ఆత్మకు ఆత్మజ్ఞానం లభిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో ధ్యానాన్ని అలవర్చుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించి ఆనందమయమైన జీవితం గడపవచ్చని సూచించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వ్యక్తిగత వికాసంతో పాటు సమాజంలో సత్సంకల్పాలు, సద్భావనలు పెంపొందించేందుకు దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, ధ్యాన సాధకులు పాల్గొని గురుపూజ నిర్వహించి, సామూహిక ధ్యానంలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.






