2 June, 2026 | 1:58 AM

ఎకరాకు 204 కోట్లు

02-06-2026 01:01 AM
  1. రాయదుర్గం ఐటీ కారిడార్ భూములకు భారీ డిమాండ్ 
  2.    5.09 ఎకరాలకు వేలం వేసిన టీజీఐఐసీ
  3. రూ.1,020 కోట్లకు పైగా ఆదాయం
  4. మూడు రోజుల క్రితం వేసిన వేలంలో ఎకరాకు రూ.237 కోట్ల ధర

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని రాయదుర్గం ఐటీ కారిడార్‌లో భూముల ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. తెలంగాణ ఇండస్ట్రీయల్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన భూముల వేలంలో ఎకరాకు రూ.204 కోట్ల ధర పలికింది. టీజీఐఐసీ 5.09 ఎకరాల భూమిని సోమవారం వేలం పెట్టగా, ఈ వేలం ద్వారా రూ.1,020 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. మూడు రోజుల క్రితం 6.29 ఎకరాలకు నిర్వహించిన వేలంలో ఎకరాకు రూ.237 కోట్ల రికార్డు ధర పలికింది.

ఈ వేలం ద్వారా టీజీఐఐసీకి రూ.1,490.73 కోట్ల ఆదాయం లభించింది. రెండు విడతలుగా చేపట్టిన వేలం ద్వారా టీజీఐఐసీకి దాదాపు రూ.2,500 కోట్ల ఆదాయం సమకూరింది. దీంతో ఐటీ కారిడార్‌లో భూములకు ఉన్న భారీ డిమాండ్ మరోసారి స్పష్టమైంది.  రాయదుర్గం ఐటీ కారిడార్‌లో భూముల కోసం పెట్టుబడిదారులు, సంస్థలు తీవ్ర పోటీ పడుతుండటంతో భూముల ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గతంలో ఎకరాకు రూ.177 కోట్లు పలికితేనే వామ్మో అనుకుని ఆశ్చర్యపోతే, ఇప్పుడు ఎకరం భూమి రూ.200 కోట్లు దాటేసి రికార్డులను సృష్టించింది.