17 June, 2026 | 2:41 AM

ఓదెల మల్లన్న ఆలయానికి భారీగా నిధులు

17-06-2026 01:47 AM

మాస్టర్ ప్లాన్ సిద్ధం... రూ. 15 కోట్లతో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ పునరుద్ధరణ

హైదరాబాద్‌లో మాస్టర్ ప్లాన్ను పరిశీలించిన ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు

హైదరాబాద్, పెద్దపల్లి, జూన్ 16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి (ఓదెల మల్లన్న) ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. ఆలయ పునరుద్ధరణలో భాగంగా రూ. 15 కోట్ల వ్యయంతో రూపొందించిన మాస్టర్ ప్లాన్ను అధికారులు ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుకు వివరించారు.

రూ. 15 కోట్ల అభివృద్ధి పనుల వివరాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో, ఆలయ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ. 10 కోట్లు కేటాయించగా, ఆలయ ప్రత్యేక నిధుల నుండి మరో రూ. 5 కోట్లు కలిపి, మొత్తం రూ. 15 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

హైదరాబాద్లో సమీక్ష

హైదరాబాద్లోని బొగ్గులకుంటలో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో.. ఆలయ మాస్టర్ ప్లాన్కు సంబంధించిన ముసాయిదాను సంబంధిత అధికారులు మరియు ప్రముఖ స్థాపతి వల్లినయాగన్ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు సమర్పించారు. ఆలయ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భక్తులకు కల్పించాల్సిన వసతులు, శిల్పకళా రీతుల గురించి ఈ సందర్భంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో ఓదెల మండల పార్టీ అధ్యక్షులు, ఆలయ చైర్మన్, డైరెక్టర్లు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.భక్తులందరి ఆరాధ్య దైవమైన ఓదెల మల్లన్న ఆలయాన్ని పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిధులతో ఆలయ ప్రాంగణంలో మరిన్ని వసతులు అందుబాటులోకి రానున్నాయని, ఇది భక్తులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.