8 July, 2026 | 2:52 AM

భూ భారతి మార్పులతో భారీ దోపిడీ

08-07-2026 01:24 AM
  1. సీఎం, మంత్రి 50-50
  2. బలిపశువులుగా అధికారులు
  3. అందరికే ఒకేలా న్యాయం ఉండాలి
  4. బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వంపై మండిపాటు

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): అన్యాయంగా నిరుపేదల భూములను దోచుకుంటూ సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి 50 వాటాలు పంచుకుంటున్నారని, భూ యాజమానులతో సంబంధం లేకుండా ‘భూ భారతి’ పోర్టల్‌లో మార్పు చేసి ప్రభుత్వం తెలంగాణలోని రైతుల ఆందోళనకు కారణమయ్యారని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం, మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న భూ భారతి పోర్టల్‌లో 22 వేల ఎకరాల భూ బదలాయింపులు జరిగాయని, యజమానులతో సంబంధం లేకుండా మార్పు చేశారని, ప్రజల హక్కులు కాలరాస్తున్నారని మండిపడ్డారు. కీలకశాఖలు సీఎం రేవంత్‌రెడ్డి, పొంగులేటి వద్దే ఉన్నాయని అన్నారు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వందలాది ఎకరాల భూమిని బదలాయించి 50 శాతం వాటాలు పంచుకున్నారని ఆరోపించారు. 10వేల కోట్ల కుంభకోణంపై రెవెన్యూ మంత్రి ఫిర్యాదు ఎందుకు చేయలేదని నిలదీశారు. రాష్ట్రంలో మాఫియా పాలన నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులతో బలవంతంగా మార్పు చేర్పులు చేయిస్తూ వారిని బలిపశువులుగా చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘భూభారతి స్కామ్ అంటే బాహుబలి స్కామ్’గా అభివర్ణించారు. వెంటనే దీనికి బాధ్యత వహిస్తు మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లిలో 13 గుంటల భూమిని సహస్ర ఇన్‌ఫ్రా సంస్థకు బదలాయించారని పోర్టల్ దొంగలు మీరేనని విమర్శించారు. భూభారతి బాధితులు బీఆర్‌ఎస్ కార్యాలయానికి రావాలని ప్రభుత్వం అవినీతిని ఎండగడదామన్నారు.

దిలీప్ నాయక్‌ను అరెస్టు చేసి, భీం రెడ్డిని వెంటనే అరెస్టు చేయకుండా నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. క్రిశాంక్, బాల్కసుమన్‌లను జైలుకు పంపారని, రేవంత్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, మక్కన్‌సింగ్‌లను ఎందుకు పంపలేదని, భుజంగరావుకు, అంబేద్కర్‌కు ఒక న్యాయం, భీం రెడ్డికి మరొక న్యాయం ఉండకూడదని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్, తుంగబాలు, దాసరి ఉష, గోపగాని రఘురాం, మంద శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.