8 July, 2026 | 2:11 AM

‘సర్’ ఒత్తిడి భరించలేం!

08-07-2026 01:21 AM
  1. పురుగుల మందు తాగి బీఎల్‌వో ఆత్మహత్యాయత్నం
  2. గద్వాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి 

ఎర్రవల్లి, జూలై 7: సర్ విధుల భారం, ఉన్నతాధికారుల ఒత్తిడిని తట్టుకోలేక బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌వో) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎర్రవల్లి మండలం శాసనూలు గ్రామంలో షాహిదా బేగం (50) అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తూనే బీఎల్‌ఓ విధులు చూస్తున్నారు. ఎన్నికల జాబితాల సవరణ, ఆన్‌లైన్ అప్‌డేట్లు, ఫారాల పరిశీలన, ఇంటింటి సర్వేలు, డేటా నమోదు వంటి పనులను అత్యవసరంగా పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని ఆమె పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో శనివారం పెబ్బేర్‌లోని నివాసంలో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఎత్తు, బరువు నమోదు, గుడ్లు, బాలామృతం పంపిణీ, యాప్‌లో సమాచారం నమోదు, డ్రాప్ అవుట్ జాబితాల తయారీ వంటి బాధ్యతలతో పాటు ఎన్నికల విధులు కూడా నిర్వహించడం అసాధ్యంగా మారిందని అంగన్‌వాడీలు వాపోతున్నారు.