28 August, 2026 | 9:43 AM

బాలాపూర్‌లో అక్రమాల మాస్టర్ ప్లాన్?

28-08-2026 02:07 AM

అక్రమ వెంచర్ల వెనుక హెచ్‌ఎండీఏ పెద్దలు!

ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఫోర్జరీ ‘దందా’

బాలాపూర్ సర్వే నంబర్లు 88 నుండి 281 వరకు దాదాపు 20 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు

సర్పంచ్ సంతకాలు, ఎల్‌ఆర్‌ఎస్ పత్రాలు ఫోర్జరీ చేసి రూ.కోట్లలో మోసాలు

ఏసీబీ, విజిలెన్స్ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

బడంగ్‌పేట్, ఆగస్టు 27 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరానికి చుట్టుపక్కల ఉన్న కన్జర్వేషన్, గ్రీన్, ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లను కాపాడాల్సిన హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగం అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బాలాపూర్ పెద్ద చెరువు వరద కాలువను సైతం ఆక్రమించి, ఎలాంటి అనుమతులు లేకుండా 20 ఎకరాల్లో భారీ అక్రమ వెంచర్ వెలిసింది.

ఫోర్జరీ పత్రాలతో ప్రజలకు బురిడీ..

హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం వెంచర్ వేస్తే 40 శాతానికి పైగా స్థలం రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, సామాజిక అవసరాలకు వదిలిపెట్టాల్సి వస్తుంది. ఈ ఖర్చులను, స్థల నష్టాన్ని తప్పించుకోవడానికి రియల్ ఎస్టేట్ మాఫియా అడ్డదారులు తొక్కింది. గ్రామ పంచాయతీ పాత పత్రాలను సృష్టించి, మాజీ సర్పంచ్ సంతకాలను ఫోర్జరీ చేయడమే కాకుండా, నకిలీ ఎల్‌ఆర్‌ఎస్  ప్రతులను తయారు చేసి అమాయక ప్రజలకు ప్లాట్లను అంటగడుతున్నారు.

ఆక్రమిత నంబర్లు ఇలా..

బాలాపూర్ గ్రామం (బడంగ్పేట్ సర్కిల్)88, 89, 90, 272, 273, 275, 276, 277, 278, 281౱ 20 ఎకరాలు ఎఫ్ టీ ఎల్ / బఫర్   జోన్ లు

ఏపీఓ, సీపీఓలలో స్పందన కరువు..

అక్రమ వెంచర్లపై స్థానికుల నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదులు వెళ్లినా హెచ్‌ఎండీఏ ఏపీఓ, సీపీఓ  స్థాయి అధికారుల్లో స్పందన కరువైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువులను, వరద కాలువలను ఆక్రమిస్తూ భవిష్యత్తులో నగరానికి ముంపు ముప్పు తెచ్చిపెడుతున్న ఈ వెంచర్లపై కనీసం షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వకపోవడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారుల్లో చలనం వచ్చేనా?

ప్రజాధనాన్ని, నిబంధనలను బురిడీ కొట్టిస్తున్న ఈ రియల్ మాఫియా ఆట కట్టించాలంటే కేవలం స్థానిక సిబ్బందిపై కాకుండా హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులపై విచారణ చేపడితే వెలుగులోకి రానున్న మరిన్ని అక్రమాలు. తక్షణమే ఈ 20 ఎకరాల లేఅవ్పు ఏసీబీ  మరియు విజిలెన్స్ అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలి. ఫోర్జరీ పత్రాలతో అక్రమాలకు పాల్పడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు, వారికి సహకరించిన హెచ్‌ఎండీఏ ఏపీఓ, సీపీఓలపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొని మోసపోవద్దని ప్రజలకు తెలిసేలా హెచ్‌ఎండీఏ కమిషనర్ తక్షణమే పబ్లిక్ నోటీస్ విడుదల చేస్తేనే అక్రమ వెంచర్లలో క్రయవిక్రయాలు ఆగిపోతాయి.