12-08-2025 06:25:47 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
వనపర్తి (విజయక్రాంతి): విద్యార్థుల అందరి సామర్థ్యాలు ఒకే విధంగా ఉండవని, వారి స్థాయిని గుర్తించి వారికి గణితం అర్థమయ్యే విధంగా బోధించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆదేశించారు. మంగళవారం ఐడిఓసిలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. విద్యార్థులు గణితంలో పట్టు సాధించే దిశగా ఉపాధ్యాయులకు కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థుల అందరి సామర్థ్యాలు ఒకే విధంగా ఉండవని, వారి స్థాయిని గుర్తించి వారికి గణితం అర్థమయ్యే విధంగా బోధించాలని ఆదేశించారు. గణితంలో బేసిక్స్ అర్థమైతేనే మిగతా తదుపరి అంశాలు కూడా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుందని కాబట్టి బేసిక్స్ నేర్పించేందుకు దృష్టి సారించాలన్నారు.
విద్యార్థుల్లో బట్టి పట్టే విధానాన్ని పోగొట్టి, సహజంగా అంశాలను నేర్చుకునే విధానాన్ని అలవాటు చేయాలన్నారు. వెనకబడిన విద్యార్థులను గుర్తించే వారికి ప్రత్యేకంగా తరగతులు పెట్టి అర్థమయ్యే విధంగా బోధించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్యూర్స్ లేకుండా ఈసారి ఫలితాలు రావాలన్నారు. బేసిక్స్ నుంచి బోధన ప్రారంభిస్తూనే రెండు వారాలకు ఒకసారి వారికి పరీక్ష పెట్టాలని సూచించారు. విద్యార్థులందరికీ గణిత పాఠాలను పక్కాగా నేర్పించడం ద్వారా కేవలం మార్కుల వరకే కాకుండా, వారు నిజజీవితంలో కూడా ఉపయోగించుకోగలరని, తద్వారా వారికి న్యాయం చేసిన వారు అవుతామని కలెక్టర్ ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో డి ఈ ఓ అబ్దుల్ ఘని, ఉపాధ్యాయులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.