calender_icon.png 13 August, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కటిక చీకట్లో హోరు వాన ఓరుగొల్లు!

13-08-2025 12:55:27 AM

వాగులుగా మారిన రహదారులు

  1. వరద నీటిలో మునిగి వృద్ధురాలి మృతి 
  2. పలు ప్రాంతాల్లో ఇండ్లలోకి చేరిన నీరు
  3. రైల్వేట్రాక్ పైకి వరద నీరు 
  4. పొంగిపొర్లుతున్న వాగులు

వరంగల్ (మహబూబాబాద్),  ఆగస్టు 12 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం వరకు కుండపోత వర్షం కురిసింది. ముఖ్యంగా వరంగల్ నగరంలో భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలైన కాశీబుగ్గ, శివనగర్, కరీమాబాద్, రంగసాయిపేట, సంతోషిమాత గుడి, లక్ష్మీపురం, అండర్ బ్రిడ్జి, మిల్స్ కాలనీ ప్రాం తాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

భారీ వర్షాల కారణంగా ఇంట్లోకి నీరు చేరడంతో సాకరాశి కుంటకు చెందిన పసునూటి బుచ్చమ్మ (80) అనే వృద్ధురాలు నీట మునిగి మరణించింది. హంటర్ రోడ్, లేబర్ కాలనీ 100 ఫీట్ల రోడ్డు ప్రాంతాల్లో వరద పొంగి ప్రవహించడంతో రోడ్లు వాగు లను తలపించాయి. ఆర్టీసీ బస్సు సర్వీసులకు అంతరాయం కలిగింది. అలాగే రైల్వేస్టేషన్‌లోకి వరద నీరు చేరడంతో కొంత సేపు రైళ్ల రాకపోకలు ఆగిపో యాయి.

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం, పోలీసులు, జీడబ్ల్యూ ఎంసీ సిబ్బంది చర్యలు చేపట్టారు. అలాగే హనుమకొండ పట్టణంలో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో వస్తువులన్నీ తడిసి పోయి ప్రజలు నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాలను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, పోలీస్ అధికారులు సందర్శించి, సహాయ చర్యలు చేపట్టారు. అండర్ బ్రిడ్జిలో నీట మునిగిన కారును రక్షించారు. 

ఉమ్మడి జిల్లాలోనూ జోరు వాన

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ మండలాల్లో భారీ వర్షపాతం నమోదయింది. ఎలుగూరు రంగంపేట చెరువు నిండి మత్తడి పోయడంతో పలు వాగులు పొంగి ప్రవహించాయి. మహబూబాబాద్ జిల్లాలో వట్టివాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. కొత్తగూడ మండలంలో వాగులు పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరింది. పాకాల, రామప్ప, లక్నవరం, గణపసముద్రం, ధర్మసాగర్, ఏలుగూరు తదితర చెరువులు జలకళతో ఉట్టిపడుతున్నాయి.

టోల్ ఫ్రీ నంబర్లతో హెల్ప్‌లైన్ 

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలో వరద ప్రాంతాల ప్రజలకు అవసరమైన సహాయ చర్యలను అందించడానికి అధికారులు టోల్ ఫ్రీ నంబర్లతో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్ నగర ప్రాంత ప్రజలు 1800 425 3434, హనుమకొండ ప్రాంతాల ప్రజలు 1800 425 1115, గ్రేటర్ వరంగల్ పరిధిలో సహాయం కోసం 1800 425 1980 నంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందాలని అధికారులు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటికి రాకూడదని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. 

సంగెం మండలంలో అత్యధికంగా 20.2 సెం.మీ. వర్షపాతం నమోదయింది. వరంగల్‌లో 14.8 సెం.మీ., వర్ధన్నపేటలో 12.2 సెం.మీ., పెద్ద వంగరలో 12 సెం.మీ., తొర్రూర్‌లో 10 సెం.మీ., కొడకండ్లలో 12.6 సెం.మీ., దేవరుప్పులలో 6.4 సెం.మీ., పర్వతగిరిలో 10 సెం.మీ., చెన్నారావుపేటలో 8.6 సెం.మీ., గీసుకొండలో 9.1సెం.మీ., జాఫర్గడ్‌లో 9.3 సెం.మీ., కేసముద్రంలో 7.1సెం.మీ., దంతాలపల్లి లో 7.5సెం.మీ., కొత్తగూడలో 7.8సెం.మీ., టేకుమట్లలో 7.4సెం.మీ., మహా ముత్తారంలో 5.7సెం.మీ., పాలకుర్తిలో 6.2సెం.మీ., ములుగులో 4.6సెం.మీ వర్షపాతం నమోదైంది.

వరదలో కొట్టుకుపోయిన బైక్ 

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు గ్రామ నాగసముద్రం చెరువు ఉప్పొంగింది. గత కొద్దిరోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నుంచి గొలుసుకట్టు చెరువుల నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నాగర్‌కర్నూల్ కేసరి సముద్రం, నాగనోలు నాగసముద్రం చెరువు ఉప్పొంగుతున్నాయి.

నాగర్‌కర్నూల్ నుంచి నాగనూల్, గుడిపల్లి, రేవల్లి వంటి గ్రామాలకు రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం ఉదయం ఓ ద్విచక్ర వాహనదారుడు వరద నీటిని దాటుతున్న క్రమంలో వరద తాకిడికి బైక్ కొట్టుకుపోయింది. అక్కడే ఉన్న కొంతమంది వాహనదారుడిని రక్షించారు. కోడేరు మండలం బావాయి పల్లి గ్రామంలో డ్యాం ఉధృతంగా ప్రవహిస్తుంది.

రైతులు పొలాలకు వెళ్లేందుకు గత నాలుగు రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వనపర్తి నుంచి ఏదుల, బావాయి పల్లి మీదుగా పెద్ద కొత్తపల్లి, లింగాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను బావాయిపల్లి నుంచి లింగాలకు వరకు పూర్తిగా నిలిపివేశారు.