13-08-2025 01:04:25 AM
బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం కూల్చివేత
కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు భారీ స్కెచ్?
* బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయం భూ మాఫియా కబంధ హస్తాల్లో నలిగిపోయింది. వందల కోట్ల విలువైన 8 ఎకరాల ఆలయ భూమిని వెంచర్‌గా మార్చి అమ్ముకోవాలన్న దురాలోచనకు ఆ పవిత్ర ఆలయం అడ్డొచ్చిందా? ‘అక్రమ కట్టడం’ అనే సాకుతో ఆలయాన్ని కూల్చివేయడం వెనుక, ఆ భూమిని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే భారీ స్కెచ్ దాగి ఉందా? అనే అనుమానాలతో రాజకీయం అట్టుడుకుతోంది. ప్రభుత్వ వాదన ప్రకారం ఇది కేవలం అక్రమ కట్టడం తొలగింపు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు, హిందూ సంఘాల ఆరోపణలు దీని వెనుక భారీ భూ కుంభకోణం దాగి ఉందని స్పష్టం చేస్తున్నాయి.
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 12 (విజయక్రాంతి): దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్‌లో ఎక రం వందల కోట్ల రూపాయలు పలుకుతోంది. ఈ లెక్కన వివాదంలో ఉన్న పెద్ద మ్మ తల్లి అమ్మవారి ఆలయం 8 ఎకరాల భూమి విలువ వందల కోట్లు ఉంటుంది. ఇంతటి విలువైన భూమిలో ఉన్న ఆలయాన్ని హడావుడిగా కూల్చివేయడం, ఆ ప్రాంతాన్ని చదును చేసే ప్రయత్నాలు చేయడం వెనుక అసలు లక్ష్యం ఆ భూమిని భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చడమేనని తెలుస్తోంది.
ఈ భూమిని చదును చేసి, ప్లాట్లుగా విభజించి కార్పొరేట్ సంస్థలకు, బడాబాబులకు కట్టబెట్టేం దుకు ప్రభుత్వం పావులు కదుపుతోంద న్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తు ల పూజలందుకునే దైవాన్ని వీధిపాలు చేసి, ఆ పవిత్ర స్థలంలో కాంక్రీట్ జంగిల్ ను నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో వీహెచ్‌పీ తలపెట్టిన ‘కుంకుమార్చన’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు.
కుంకుమార్చన కార్యక్రమంతో పాటు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఆ పార్టీ నాయకురాలు మాధవీలతను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో వారిద్దరి హౌస్ అరెస్ట్‌పై బీజేపీ, వీహెచ్‌పీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతూ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
‘శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్టు చేయడం, ముఖ్యంగా గృహనిర్బంధం చేయడం ప్రభుత్వ అహంకారానికి పరాకాష్ట. ఇది సనాతన ధర్మంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన యుద్ధం. హిందువుల ఓట్లతో గెలిచి, ఇప్పుడు హిందువుల ఆలయాలనే కూల్చివేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు మా పోరాటం ఆగదు’ అని బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
పోలీసుల దిగ్బంధంలో పెద్దమ్మ గుడి
మంగళవారం బంజారాహిల్స్‌లోని పెద్ద మ్మ తల్లి ఆలయం వద్ద విశ్వహిందూ పరిషత్ తలపెట్టిన ‘కుంకుమార్చన’ కార్యక్రమా న్ని పోలీసులు భగ్నం చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసు కుని, దాదాపు 1,200 మంది పోలీసులను మోహరించారు. అటువైపు వెళ్లేందుకు ప్ర యత్నించిన విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి కార్ఖానా, బోయిన్‌పల్లి తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు.
పెద్దమ్మ గుడిలో పూజలు చేస్తే తప్పేంది?
కేంద్ర మంత్రి బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిలో పూజలు చేస్తే తప్పేంటని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలనకు ఇది నిదర్శనమన్నారు. నగరంలో హిందూ సంఘాలను, బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడం మూర్ఖత్వమని మండిపడ్డారు. పెద్దమ్మ గుడిని కూల్చిన గుండాలను అరెస్టు చేయకుండా శాంతియుతంగా పూజలు చేసేందుకు వచ్చే వారిని అరెస్టు చేస్తారా అని నిలదీశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓట్ల కోసం కాంగ్రెస్ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందన్నారు. ఒక వర్గం ఓట్ల కోసం సర్కారు హిందువుల మనోభావాలతో ఆటలాడుతున్నదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తగిన బుద్ధి చెప్పే రోజు త్వరలో వస్తుందన్నారు.
సర్కారు చర్య ప్రజాస్వామ్య విరుద్ధం
ఎంపీ డీకే అరుణ
రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలను వారి ఇళ్ల వద్దే ముట్టడి, గృహ నిర్బంధం చేసి కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ప్రజా వ్యతిరేకతను బహిర్గతం చేసిందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. పెద్దమ్మగుడి ఆలయ కార్యక్రమా నికి, ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఈ హౌస్ అరెస్టు ఓ కుట్ర అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పవిత్రమైన దేశభక్తి కార్యక్రమాలను అడ్డుకోవడం, పోలీసులతో ప్రతిపక్షాల గొంతును నొక్కివేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. రాంచందర్ రావు ఇంటి నుంచి పోలీసులు వెళ్లిపోవడంతో పాటు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
రాంచందర్ రావు అరెస్టు
ప్రజాస్వామ్యంపై దాడే: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్
బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు హౌస్ అరెస్టు ప్రజాస్వామ్యంపై చేసిన దాడిగా ఆ పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జ్ ఎన్‌వీ సుభాశ్ పేర్కొన్నారు. ఆయనను అక్రమంగా గృహనిర్బం ధం చేసినట్లు ఆరోపించారు. ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రలో పాల్గొనకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యంపై నేరుగా దాడి చేయడమేనని విమర్శించారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేసి, గృహనిర్బంధాలు అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని శవపేటికలో పెట్టిన అనేక ఘటనలు రాష్ర్టం చూసిందని, ఇప్పుడు అదే దారిలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. అణచివేత పాలనను కొనసాగించడం ప్రజాస్వామ్య సూత్రాలకు, రాజ్యాంగ విలువలకు అవమానం అని పేర్కొన్నారు.
నిర్బంధాలతో బీజేపీని అణచివేయాలని చూడడం దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర రాష్ర్ట ఇన్‌చార్జి గంగిడి మనోహర్ రెడ్డి విమర్శించారు. ఇదేవిధంగా కొనసాగితే రాష్ర్టవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హౌస్ అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, తదితరులు ఖండించారు.
ముస్లింల మెప్పు కోసమే
మందిరాల ధ్వంసం: వీహెచ్‌పీ
బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ కూల్చివేత, హిందూ కార్యకర్తల అణచివేతపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక చర్యలకు, దమనకాండకు పాల్పడు తోం దని మండిపడింది. కేవలం ముస్లింల ఓటు బ్యాంకు మెప్పు కోసమే రాష్ర్టంలో హిందూ మందిరాలను ధ్వంసం చేస్తున్నారని, అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి రాష్ర్టవ్యాప్తంగా హిందూ సంఘాల నాయకులపై జరిగి న అణచివేతను తీవ్రంగా ఖండి స్తూ విశ్వహిందూ పరిషత్ ఓ ప్రకటన విడుదల చేసింది.
నిజాం వారసత్వాన్ని అందుకుని హిందువులపై దాడులు
పోలీసులను ముందు పెట్టి రాష్ర్ట ప్రభుత్వం హిందువులను భయభ్రాంతులకు గురిచేస్తోందని వీహెచ్‌పీ రాష్ర్ట సహ కార్యదర్శి చింతల వెంకన్న, రాష్ర్ట ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, ధర్మ ప్రసార్ రాష్ర్ట కోకన్వీనర్ సుభాశ్ చందర్ విమర్శించారు. ‘రాష్ర్ట ప్రభుత్వం నిజాం నిరంకుశ పాలనను తిరిగి తీసుకువస్తోంది. దీనిని హిందూ సమాజం ఎప్పటికీ ఒప్పుకోదు. సెక్యులరిజం అంటే హిందుత్వాన్ని తొ క్కిపెట్టడమేనా? నిజాం వారసత్వాన్ని అందుకొని హిందువులపై దాడులకు దిగితే తెలం గాణ సమాజం తగిన బుద్ధి చెప్పక తప్పదు,’ అని వారు తీవ్రంగా హెచ్చరించారు.
రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమిస్తాం: వీహెచ్‌పీ నాయకులు
ప్రభుత్వ అణచివేత చర్యలకు భయపడేది లేదని విశ్వహిందూ పరిషత్ నాయకులు స్పష్టం చేశారు. ‘ఈ అక్రమ కేసులు, అరెస్టులతో ఉద్యమం ఆగదు, సరికదా రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమించి మందిరం నిర్మించి తీరుతాం. తరతరాలుగా పూజలు అందుకుంటున్న పెద్దమ్మతల్లి విగ్రహాన్ని, మందిరాన్ని ధ్వంసం చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ప్రభుత్వం హిందువుల మనోభావాలను గౌరవించి, కూల్చివేసిన స్థలంలో తిరిగి భవ్యమైన మందిరాన్ని నిర్మించి తీరాల్సిందే.
ఆ లక్ష్యం చేరే వరకు మా పోరాటం ఆగదు,’ అని వారు తేల్చిచెప్పారు. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రామచంద్రరావుతో సహా అనేక మంది ముఖ్య నాయకులను గృహ నిర్బంధం చేసి పూజకు దూరం చేశారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 2,000 మంది బజరంగ్‌దళ్ కార్యకర్తలను అరెస్టు చేసేవరకు వదిలిపెట్టబోమని పోలీసులు హెచ్చరించడం ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనలకు నిదర్శనమని ఖండించారు.
రెవెన్యూ అధికారుల తీరుపై అనుమానాలు
ఈ భూమిపై దశాబ్దాలుగా సివిల్ కోర్టులో వివాదాలు నడుస్తున్నాయి. ఇది మహారాజా కిషన్ ప్రసాద్ వారసులకు చెందినదని, 1980లలో అక్రమంగా అమ్మకాలు జరిగాయని కోర్టు రికార్డులు చూపిస్తున్నాయి. తెలంగాణ హైకోర్టు ఈ వివాదంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించి, సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అయితే ఇంతకాలం లేని అభ్యంతరం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ అధికారులు చూపిన హడావుడి తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.
కోర్టులో కేసు నడుస్తుండగా, ఏకపక్షంగా ఆలయాన్ని కూల్చివేయడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని బీజేపీ, హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడే కాంగ్రెస్ ప్రభుత్వం, తన అసలు రంగును ఇప్పుడు బయటపెట్టుకుందని వారు విమర్శిస్తున్నారు. కేవలం భూమిని కబ్జా చేయాలన్న ఏకైక దురుద్దేశంతోనే, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ దారుణానికి ఒడిగట్టారని వారు ఆరోపిస్తున్నారు.
ఆందోళనలపై ఉక్కుపాదం
ఆలయ కూల్చివేతను నిరసిస్తూ బజరంగ్ దళ్, వీహెచ్‌పీ, బీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసింది. బోనాల పండుగ నాడు బోనం సమర్పించడానికి వెళ్లిన మహిళలు, భక్తులపై పోలీసుల ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆలయం కూల్చివేత వెనుక వెంచర్ల కుట్ర లేదని ప్రభుత్వం ఎందుకు ధైర్యంగా ప్రకటించడం లేదు? ఈ భూమిని ఏం చేయబోతున్నారో స్పష్టత ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతోంది అని ప్రతిపక్షాలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి.
ప్రభుత్వ పెద్దల అండదండలతోనే రెవెన్యూ అధికారులు ఇంతటి తెగింపుకు పాల్పడ్డారని, ఈ వేల కోట్ల భూ దందాలో ప్రభుత్వ పెద్దల పాత్రపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన వివరణ రాకపోవడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది.
మొత్తంమీద, బంజారాహిల్స్ ఆలయ కూల్చివేత ఘటన కేవలం ఒక అక్రమ కట్టడం తొలగింపుగా కాకుండా, వందల కోట్ల రూపాయల భూ కుంభకోణంగా, హిందూ విశ్వాసాలపై జరిగిన దాడిగా రూపుదాల్చింది. భక్తుల మనోభావాలను గౌవించి, ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా? లేక వందల కోట్ల వ్యాపార ప్రయోజనాలకే పెద్దపీట వేసి, ఆలయ భూమిని కాంక్రీట్ జంగిల్‌గా మారుస్తుందా? అన్నది తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తోంది.
తెలంగాణలో హిందువుగా పుట్టడమే నేరమా?
- బీజేపీ నాయకురాలు మాధవీలత
తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో హిందువుల అణచివేత పరాకాష్టకు చేరింది. భక్తితో అమ్మవారికి పూజ చేయడం నేరమైంది. సంప్రదాయబద్ధంగా బోనం సమర్పించడం పాపమైంది. చివరికి ఈ గడ్డపై హిందువుగా పుట్టడమే ఒక నేరంగా ప్రభుత్వం పరిగణిస్తోంది. ‘ఏమిటీ అరాచకం? తెలంగాణ గడ్డపై అమ్మవారిని పూజించుకోవడం కూడా నేరమా? బోనం ఎత్తుకుని గుడికి వెళ్తే అక్రమ కేసులు పెడతారా? ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా? అయ్యా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ, వినండి! మీరు ఎన్ని సార్లు జైల్లో పెట్టినా, ఎన్ని హౌస్ అరెస్టులు చేసినా మేం భయపడం.
ఇది నా దేశం, ఇది నా ధర్మం. భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును కాలరాయడానికి మీరెవరు? మమ్మల్ని ఆపే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు. రాష్ర్టంలో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పెద్దపీట వేస్తూ, హిందువుల మనోభావాలను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోంది. తరతరాలుగా పూజలందుకుంటున్న పెద్దమ్మతల్లి విగ్రహాన్ని అపవిత్రం చేసి, మందిరాన్ని కూల్చివేయడమే కాక, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హిందువులపై, మహిళలపై లాఠీచార్జి చేయడం ఈ ప్రభుత్వ రాక్షసత్వానికి నిదర్శనం.
ఒకనాడు ఈ దేశాన్ని పట్టిపీడించిన ఆంగ్లేయులను ఎలాగైతే తరిమికొట్టామో, నా సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ గడ్డ నుంచి తరిమి కొట్టినప్పుడే హిందూ ధర్మానికి నిజమైన రక్షణ లభిస్తుంది. ఈ అరెస్టులు, అక్రమ కేసులు మాకు కొత్త కాదు.
ధర్మం కోసం ఎన్నిసార్లయినా జైలుకు వెళ్లడానికి సిద్ధం. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, వాటన్నింటినీ ఎదుర్కొని తీరుతాం. పెద్దమ్మతల్లి పవిత్రతను కాపాడి, కూల్చిన అదే స్థానంలో అంతకంటే భవ్యమైన మందిర నిర్మాణం సాధించి తీరుతాం. లక్ష్యం చేరే వరకు మా పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.
కుంకుమార్చనకు వెళ్తుంటే అరెస్ట్ చేస్తారా?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు
బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిలో కుంకుమార్చన కార్యక్రమంతో పాటు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన తనను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు పేర్కొన్నారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. తెల్లవారుజామున పోలీసులు తన నివాసానికి వచ్చి తనను గృహనిర్బంధంలో ఉంచుతున్నట్లుగా తెలియజేశారని అన్నారు.
ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు కూల్చివేసిన బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ ఆలయానికి సంబంధించిన అంశంలో మీరు అక్కడికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లుగా పోలీసులు తనకు చెప్పారని వివరించారు. స్థానిక ప్రజలు పెద్దమ్మ గుడిని పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారని, కొందరు ఆలయ స్థలంలో పూజకు పిలుపునిచ్చారని తెలిపారు. పూజ కోసం బయలుదేరేందుకు సిద్ధమైన తనను నిరంకుశంగా హౌస్ అరెస్టు చేశారని విమర్శించారు.
హిందూ ధర్మాలకు సంబంధించిన హిందూ సంస్థల కార్యక్రమాల కోసం వెళ్లబోతున్న తనను పోలీసులు అరెస్టు చేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ మత కార్యకలాపాలను పరిమితం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. తనను మాత్రమే కాకుండా నగరంలోని అనేక మంది కార్పొరేటర్లను, నాయకులను కూడా అరెస్టు చేశారని తెలిపారు.
హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేయడం దుర్మార్గమని, ఇది హిం దువుల మౌలిక హక్కులను అణచివేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మతపరమైన స్వేచ్ఛను భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని, కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభు త్వం మాత్రం హిందువులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. కాగా రాంచందర్‌రావును హౌస్ అరెస్ట్ చేయడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివచ్చారు. ప్రభుత్వం తీరును బీజేపీ శ్రేణులు తీవ్రంగా విమర్శించాయి.