4 June, 2026 | 2:07 AM

వర్షాకాలంలో అత్యవసర సేవల సమన్వయానికి చర్యలు

04-06-2026 01:21 AM

ఘట్ కేసర్, జూన్ 3 (విజయక్రాంతి): వర్షాకాలంలో ప్రజా రక్షణకు, అత్యవసర సేవల సమన్వయానికి తీసుకోవలసిన అత్యవసర సేవల చర్యలకు ఘట్కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ సిబ్బంది, పోలీసు విభాగాలు క్షేత్రస్థాయిలో తీసుకోవలసిన తక్షణ చర్యల గురించి చర్చించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలవకుండా డ్రైనేజీలు, నాలాల్లోని చెత్తను తక్షణమే తొలగించాలన్నారు. అలాగే నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా కల్వర్టులను పూర్తిగా శుభ్రం చేయాలన్నారు.

తెరిచి ఉన్న మ్యాన్హోల్స్కు మూతలు వేయడం, ప్రమాదకరమైన చోట్ల హెచ్చరిక బోర్డులు పెట్టడం చేయాలని, చెట్లు విరిగిపడినా, నీరు నిలిచినా తక్షణమే స్పందించేందుకు డిఆర్‌ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. దోమల నివారణకు అంటు వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లడం ఫాగింగ్ చేయాలన్నారు. ట్రాఫిక్ పోలీసులు నీరు ఎక్కువగా నిలిచే రోడ్లను గుర్తించి, ప్రత్యామ్నాయ ట్రాఫిక్ మార్గాలను సిద్ధం చేసుకోవాలని, భారీ వర్షాల సమయంలో వాహనాలు నిలిచిపోకుండా జంక్షన్లలో అదనపు సిబ్బందిని కేటాయించాలన్నారు. 

రోడ్లపై గుంతలు ఉన్న చోట వాహనదారులను అప్రమత్తం చేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసులు మున్సిపల్ అధికారులతో కలిసి 24/7 కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితులను పర్యవేక్షించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలించడంలో సహాయపడాలన్నారు. వర్షాలు, వరదలపై సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను అరికట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాజీవ్ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ నరేష్, ట్రాఫిక్ విభాగం సిఐ రవీందర్, పోలీస్ లా అండ్ ఆర్డర్ విభాగం సిఐ బాలస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.