నీటిఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి
డీపీఓ కొండ వెంకయ్య
మంగపేట, ఏప్రిల్ 8 ( విజయక్రాంతి ) : వేసవి కాలంలో గ్రామాలలో ప్రజలకు నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా పంచాయతీ కార్యదర్శులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి ( మంగపేట మండల ప్రత్యేక అధికారి ) కొండ వెంకయ్య పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. బుధవారం మంగపేట ఎంపీడీఓ కార్యాలయంలోని మీటింగ్ హాల్ లో ఎంపీడీవో బి.బద్రు అధ్యక్షతన మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి హాజరైన జిల్లా పంచాయతీ అధికారి కొండ వెంకయ్య ( మండల ప్రత్యేక అధికారి ) ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో ఏ ఒక్క గ్రామంలో కూడా నీటి ఎద్దడి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై ఉందని తెలిపారు. ఏ గ్రామంలోనైనా నీటి సమస్య ఉందని తెలిస్తే తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాలలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాలను పర్యవేక్షించాలన్నారు.
మండలంలోని మంగపేట, మల్లూరు, రాజుపేట గ్రామాలలో ఉన్న లాడ్జీలకు ట్రేడ్ లైసెన్స్ తో పాటు నిర్వాహకుల నుండి ప్రభుత్వ నిభందనల మేరకు ట్యాక్స్ వసూలు చేయాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శులను ఆదేశిం చారు. మండలంలోని పలు గ్రామాలలో ఉన్న వాటర్ ప్లాంట్స్ ను తనిఖీ చేసి ట్రేడ్ లైసెన్స్ వసూలు చేయాలని, నిభందనలకు విరుద్ధంగా ఉన్న వాటర్ ప్లాంట్స్ ను సీజ్ చేయాలని ఆదేశించారు.
గ్రామాలలో వంద శాతం పన్నులు వసూలు చేయాలని, విధులలో నిర్లక్ష్యంగా ఉండవద్దని, గ్రామాలలోని సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్భా పాఠశాలను సందర్శించి తగిన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి.బద్రు , మండలంలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.




