11-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగకు హైదరా బాద్ నుంచి సొంత గ్రామాలకు వెళ్లే వారికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలు చేపట్టామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ జామ్ కాకుండా అన్ని ఏర్పాట్లూ చేపట్టామని, 12 లక్షలు వాహనాలు ఊర్లకు వెళ్తాయని భావిస్తున్నామని పేర్కొన్నారు. గత సంవత్సరం 9 లక్షల వాహనాలు వెళ్లి వచ్చాయని, టోల్‌గేట్ వద్ద భారీగా జామ్ అయితే టోల్ గేట్ వదిలేయాలని ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం అయిందని, ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం టెండర్లను పిలిస్తున్నామని తెలిపారు. పంతంగి టోల్‌గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని, అక్కడ టోల్ గేట్ ఓపెన్ చేయాలని చెప్పామని పేర్కొన్నారు. డీజీపీతో చెప్పి భద్రత ఏర్పాటు చేశామని, ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ఆగిన వాహనాలను క్రెన్స్ సహాయంతో మూవ్ చేసేందుకు ఏర్పాటు చేశామన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసినట్టు వివరించారు. తెలంగాణ బార్డర్ వరకు మా బాధ్యతగా పనులు చేస్తున్నామని మంత్రి కోమటి రెడ్డి స్పష్టం చేశారు.