విజయ డైరీ పూర్వ వైభవానికి చర్యలు
హనుమకొండ, ఆగస్టు 13(విజయ క్రాంతి): విజయ డైరీ పూర్వ వైభవానికి తెచ్చే విధంగా త్వరలోనే చర్యలు చేపడతామని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. రైతులు పశుపోషణపై దృష్టి సారించడం ద్వారా వ్యవసాయంతో పాటు నిరంతర ఆదాయాన్ని పొందవచ్చని, రైతులు తమ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన పశువులను స్వయంగా ఎంపిక చేసుకోవడం ద్వారా పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
గురువారం కలెక్టర్ విజయ డైరీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పాల సేకరణ కేంద్రం, పాల శీతలీకరణ కేంద్రం, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, పాలు పరీక్షించే ప్రయోగశాలను పరిశీలించి, అక్కడి కార్యకలాపాలు, పాల సేకరణ, నాణ్యతా ప్రమాణాలు, పాల ఉత్పత్తుల తయారీ తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పాడి రైతుల సంక్షేమ సంఘం సభ్యులు, రైతులు, బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు పశువులను పోషించడం ద్వారా నిరంతర ఆదాయం పొందడంతో పాటు ప్రజలకు నాణ్యమైన, స్వచ్ఛమైన పాలను అందించడంలో భాగస్వాములు కావచ్చన్నారు. విజయ డైరీతో పశుసంవర్ధక శాఖను అనుసంధానం చేసి, పాడి రైతులకు ఆధునిక పశుపోషణ పద్ధతులు, పశువుల ఎంపిక, పశువైద్య సేవలు, పాల ఉత్పత్తి పెంపు తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.






