మూడు రోజులుగా మీసేవ బంద్!
- రాష్ట్ర వ్యాప్తంగా ఆగిన సేవలు
- నిలిచిన కోట్ల రూపాయల లావాదేవీలు
- పనిచేయని టోల్ ఫ్రీ
సంగారెడ్డి, ఏప్రిల్ 7(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా గత మూడురోజులుగా ‘మీసేవ’ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ సేవలన్నింటికి మాధ్యమంలా పనిచేస్తున్న మీ సేవ సేవలు నిలిచిపోవడంతో దాదాపు అన్నిరకాల లావాదేవీల కు విఘాతం ఏర్పడింది. రెవెన్యూ, ట్రాన్స్‌పోర్ట్‌తో పాటు నిత్యం మీ సేవ ద్వారానే ఆర్థిక లావాదేవీలు జరిపే అన్ని సంస్థలకు గత మూడు రోజులుగా ఎన్నో ఇక్కట్లు ఎదురవుతున్నాయి.
గత రెండు రోజులుగా సాఫ్ట్‌వేర్ అప్డేషన్ పేరుతో ఆర్థిక లావాదేవీలు పూర్తిగా ఆగిపోయాయి. సోమవారం అన్ని సేవలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు నడుస్తున్నా చెల్లింపులు మాత్రం సదరు శాఖకు వెళ్లక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒకవైపు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు మూడు రోజులుగా కోట్ల రూపాయల చెల్లింపులు ఆగిపోయాయి. అందు కుతోడు సమయానికి చెల్లించాల్సిన పన్ను లు చెల్లించలేక మీసేవ పుణ్యమా అని అదనపు పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఇది ప్రజలకు అదనపు భారంగా మారింది.
ఆగిన రిజిస్ట్రేషన్లు..
రాష్ట్రంలో మూడురోజులుగా మీ సేవ సాఫ్ట్‌వేర్ మూలంగా కొత్తగా రిజిస్టేషన్ లు ఆగిపోయాయి.వీటికి చెల్లించాల్సిన చలాన్ లు చెల్లింపులు జరగడంలేదు.దీంతో రిజిస్టేషన్లు జరగక అటు కొనుగోలుదారులు, ఇటు అమ్మకందారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం మూడు రోజు ల్లోనే మీ సేవ సేవల అంతరాయం లక్షలాది ప్రజలకు సమస్యగా పరిణమిం చింది.
కాగా మీ సేవలో కొద్దిమేర ఆర్థిక లావాదేవీలు సోమవారం మొదలవగా మూడురోజుల తర్వాత కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరుగుతున్నాయి. ఐతే ఇందులో చాలావరకు చెల్లింపులు సదరు వినిగమయోగదారుడు చెల్లించిన శాఖకు చేరడం లేదట. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన వస్తోంది.
టోల్ ఫ్రీ నో రిప్లయ్
మీసేవ సేవలు మూడు రోజులుగా ఎలాంటి సేవలకు నోచుకోకపోగా సోమవారం నుంచి కనీసం ఫిర్యాదులు కూడా అందుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.వేల సంఖ్యలో ప్రజలు చెల్లింపునకు తాము కట్టిన శాఖలో జమ కాక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయమై మీ సేవ సెంట్రల్ డెస్క్ టోల్ ఫ్రీకి చేస్తే సమాధానం లేదు. ప్రభుత్వ సేవలను నిర్వహించే మీ సేవ కనీసం ఫిర్యాదులను కూడా స్వీకరించే పరిస్థితి లేకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.




