ప్రియాంకకు అవగాహన లేదు
* ఆమె పార్లమెంట్‌కు కొత్త
* కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఫైర్
* మోదీ ప్రసంగం బోర్ కొట్టిందన్న ప్రియాంక
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన సుదీర్ఘ ప్రసంగం తనకు బోర్ కొట్టించిందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె మొదటిసారి ఎంపీగా రావడం వల్ల పార్లమెంట్‌లో జరిగే చర్చలపై ప్రియాంకకు అవగాహన ఉండదని ఎద్దేవా చేశారు. ఏఎన్‌ఐతో రిజిజు మాట్లాడుతూ మోదీ చేసిన ప్రసంగంలో చెప్పిన విషయాలు ఆమెకు అర్థం కాలేదన్నారు. సభలో మోదీ వాస్తవాలను వెల్లడించారని.. అంతేకాని తన అభిప్రాయాలను చెప్పలేదన్నారు.
పార్లమెంట్‌లో ప్రియాంకకు అనుభవం లేకపోవడం వల్ల ప్రధాని ప్రకటనలపై ఆమెకు తక్కువ అవగాహన ఉంటుందన్నారు. గత 75 ఏళ్లలో రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఏ విధంగా మార్చివేసిందో వాస్తవాలను మోదీ విపులంగా వివరించారని ఆయన పేర్కొన్నారు. తమ రాజకీయ, స్వప్రయోజనాల కోసం నెహ్రూ కుటుంబం ఏ విధంగా రాజ్యాంగంలో సవరణలు చేసిందో మోదీ పేర్కొన్నారని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలోని లోతైన అర్థం ఆమెకు అర్థం కాకపోవచ్చన్నారు. ఏదిఏమైనా ఎంపీలుగా మనమందరం ప్రధానిని గౌరవించాలని ఆయన అన్నారు.
మోదీ ప్రసంగం బోర్: ప్రియాంక
75 ఏళ్ల రాజ్యాంగంపై రెండు రోజుల చర్చ సందర్భంగా శనివారం లోక్‌సభలో ప్రదాని మోదీ దాదాపు రెండు గంటలు ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ఆయన విరుచుకుపడ్డారు. కుటుంబ రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే మోదీ సుదీర్ఘ ప్రసంగం తనకు బోర్ కొట్టించిందని, ఎటువంటి ఆసక్తిని కల్గించలేదని, విసుగు తెప్పించిందని కాంగ్రెస్ ఎం పీ ప్రియాంకగాం ధీ విమర్శించారు. వరుసగా రెండు మ్యాథ్స్ క్లాస్‌లు విన్నట్టు ఉందని సెటైర్ వేశారు. ఈ నేపథ్యంలో ప్రియాంక వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రిజిజు స్పందించారు.






