29 July, 2026 | 12:49 AM

ప్రజాస్వామ్యంలో కమిటీలు కీలకం

29-07-2026 12:00 AM

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ 

శాసనసభా కమిటీలు ఇతర రాష్ట్రాల్లో స్టడీటూర్ చేయాలి

మంత్రి శ్రీధర్‌బాబు సూచన 

స్పీకర్ ఛాంబర్‌లో అసెంబ్లీ కమిటీల సమావేశం 

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కమిటీల పాత్ర చాలా గొప్పదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శాసనసభ సమావేశాల సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విదంగా చూడాల్సిన బాధ్యత హామీల కమిటీలదని, ఆ విధంగా పనిచేయాలని స్పీకర్ సూచించారు. మంగళవారం స్పీకర్ ఛాంబ ర్‌లో ప్రభుత్వ హామీల అమలు కమిటీ, శాసనసభ నియమాల కమిటీ, విలువల కమిటీల ప్రారంభ సమావేశం జరిగింది.

ఈ సమావేశాలకు స్పీకర్  గడ్డం ప్రసా ద్‌కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ.. నియామాల కమిటీ శాసనసభ సక్రమమైన, సమర్ధవంతమైన, ప్రజాస్వామ్యబద్ధమైన నిర్వహణలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుందన్నారు. శాసనసభ చట్టాల ద్వారానే కాకుం డా ఆ చట్టాలను రూపొందించే సభ్యుల ప్రవర్తన, నిబద్ధత మరియు వ్యవహార శైలి ద్వారా కూడా అంచనా వేయబడుతుందన్నారు.

రాగద్వేషాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా కమిటీలు పనిచేయాలని ఆయన సూచించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. శాసనసభలో సభ్యులకు మొదటిగా ఇచ్చేది రూల్స్ బుక్, దానికి అనుగుణంగా స్పీకర్  శాసనసభను నడుపుతారని తెలిపారు. గత ప్రభుత్వంలో రూల్స్ బుక్ ను మార్చివేశారని వివరించారు. శాసనసభ కమిటీలు ఇతర రాష్ట్రాలలో కూడా స్టడీ టూర్ చేసి ఆయా రాష్ట్రాల శాసనసభలలో అమలవుతున్న నిబంధనలను పరిశీలించాలి, వారి సలహాలు తీసుకోవాలని తెలిపారు.  సభలో నియమాలను  పాటించే విదంగా చూడడంతో పాటు, సభ హుందాతనాన్ని కాపాడడంలో విలువల కమిటీది కీలక పాత్ర అన్నారు.

వివిధ  కమిటీల చైర్మన్లు మాట్లాడుతూ... శాసనసభ తమపై  ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తూ సభ గౌరవాన్ని పెంచు తామని తెలిపారు. ఈ సమావేశంలో శాసనసభ హామీ ల అమలు కమిటీ చైర్మన్ పటోళ్ల సంజీవరెడ్డి, సభ్యులు జె. అనిరుధ్ రెడ్డి, జారే ఆదినారాయణ,   రూల్స్ కమిటీ సమావేశానికి  కమిటీ సభ్యులు దానం నాగేందర్, తూడి మెఘారెడ్డి, భూక్యా మురళి నాయక్, నైతిక విలువల కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాష్‌రెడ్డి, సభ్యులు జీ మధుసూదన్‌రెడ్డితోపాటు  శాసన మండలి  సెక్రటరీ డాక్టర్ వీ నరసింహాచార్యులు, అసెంబ్లీ సెక్రటరీ రేండ్ల తిరుపతి పాల్గొన్నారు.