7 March, 2026 | 9:25 PM

నేరాల రహిత పట్టణంగా తీర్చిదిద్దుదాం

07-03-2026 07:57 PM

* జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

* వ్యాపారస్తులతో సమావేశం

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణాన్ని మరింత సురక్షితంగా, నేరాల రహితంగా మార్చేందుకు సిసిటీవీ కెమెరాల ఏర్పాటు అత్యంత కీలకమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్ లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ సభ్యులచే పోలీసు ఎఆర్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి పట్టణంలోని వివిధ వ్యాపార సముదాయాలకు చెందిన 27 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సురక్షితమైన ఆదిలాబాద్ నిర్మాణంలో వ్యాపార వర్గాలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వ్యాపార సంస్థ, దుకాణం, మార్కెట్ ప్రాంతాల్లో సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను ముందుగానే నిరోధించడమే కాకుండా, ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించడానికి  ఉపయోగపడుతుందని తెలిపారు.

ఆదిలాబాద్ పట్టణాన్ని పూర్తిగా సిసిటీవీ నిఘా పరిధిలోకి తీసుకురావడం లక్ష్యం అని తెలిపారు. ఇందుకు పోలీసు శాఖతో తాము స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు, ప్రజలు అందరూ కలసికట్టుగా పనిచేయాలని కోరారు. దొంగతనాలు, నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలు వంటి సంఘటనలను అరికట్టడంలో సిసిటీవీ కెమెరాల పాత్ర అత్యంత ముఖ్యమని తెలిపారు.

ఈ సమావేశంలో డీఎస్పీలు జీవన్ రెడ్డి, ఇంద్రవర్ధన్, సిఐలు సునీల్ కుమార్,  నాగరాజు, కర్రె స్వామి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దినేష్ మటోలియా, ప్రతినిధులు, పట్టణంలోని వివిధ వ్యాపార సంఘాల నాయకులు, రిజర్వాయిన్స్ ఇన్స్పెక్టర్లు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.