విలీనం ఓకే.. వాటి సంగతేంటి?
రక్షణ మంత్రితో భేటీ అయిన ఈటల రాజేందర్
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): దేశంలో ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డులను విలీనం చేసిన నేపథ్యంలో పలు అంశాలపై స్పష్టత కావాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్.. మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలను విలీనం చేస్తున్నట్టు ప్రకటించారని, సివిల్ ఏరియా అంటే 16 సివిల్ బజార్లు మాత్రమేనా లేక మిగతా ప్రాంతం కూడా వస్తుందా స్పష్టత ఇవ్వాలన్నారు. బుధవారం ఢిల్లీలో రాజ్‌నాథ్‌తో ఈటల భేటీ అయ్యారు.
కంటోన్మెంట్ విలీనానికి పచ్చజెండా ఊపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఉద్యోగుల విలీనం, పెన్షనర్లకు జీతాలు అందించే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఉద్యోగులందరినీ జీహెచ్‌ఎంసీలోనే విలీనం చేయాలని, బోర్డులో పనిచేస్తున్న 125 మంది ఉద్యోగులు చనిపోయారని, 2011 నుంచి కారుణ్య నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం 99 సంవత్సరాలు లీజుకు ఇచ్చిన భూములన్నీ వేరే వారి చేతుల్లోకి వెళ్లాయని, ఈ భూముల వ్యవహారం త్వరగా తేల్చాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
ఆ పరిశ్రమలను పునరుద్ధరించండి
హైదరాబాద్‌లో కేంద్ర పరిశ్రమలను పునరుద్ధరించాలని కేంద్రమంత్రులను కోరినట్లు ఈటల తెలిపారు. ౪ రోజులుగా కేంద్ర మంత్రులను కలుస్తూ తన నియోజకవర్గ సమస్యల పరిష్కారానికై వినతి పత్రాలు ఇచ్చినట్లు వెల్లడించారు. రైల్వే, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, రక్షణ, ఉపరితల రవాణా శాఖ మంత్రులను కలిసి సమస్యలపై విన్నవించినట్లు తెలిపారు. బొల్లారం ఆర్‌ఓబీ, వినాయక్ నగర్, నేరేడ్‌మెట్ అండర్ పాస్ సహా మిగతా రైల్వే అండర్ పాస్‌లు, బ్రిడ్జిల విషయంపై, ఎంఎంటీఎస్ రైల్వే విస్తరణపై మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసినట్లు తెలిపారు.






