16 July, 2026 | 10:16 AM

బీజేపీలోకి ఏనుగు రవీందర్‌రెడ్డి

04-07-2024 02:00 AM

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీజేపీకి అన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు సాధించిన కమలనాథులు... పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో పోటీ చేసి 8 సీట్లు సాధించి సత్తా చాటారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ కనీసం ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోయింది. కాంగ్రెస్‌తో సమానంగా 8 ఎంపీ సీట్లు సాధించడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా బీజేపీకి డిమాండ్ పెరిగిపోయింది. అధికారంలో ఉన్న పార్టీకి ధీటుగా సమాధానం చెప్పే సత్తా బీజేపీకి ఉందని నాయకులు భావిస్తున్నారు. బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరి గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తిరిగి కాషాయ పార్టీకి మారేందుకు ప్రయత్నిస్తున్నారు.

కమలం నేతలతో టచ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పుడే  బీజేపీలో చేరి పుంజుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ప్రధాన నేతల ద్వారా పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకుపోయినట్లు తెలుస్తోంది. హైకమాండ్ సైతం రవీందర్‌రెడ్డి బీజేపీలోకి తీసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని పార్టీ నేతలు అంటున్నారు. బీజేపీలో చేరి స్థానికంగా పార్టీని బలోపేతం చేసుకుని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని రవీందర్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2004, 2009, 2010, 2014లో ఎల్లారెడ్డి నుంచి రవీందర్‌రెడ్డి బీఆర్‌ఎస్ తరఫున విజయం సాధించారు.

2019లోనూ బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి సురేందర్ చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలో బలంగా మారిన బీజేపీలోకి వెళ్తే రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని భావించే రవీందర్ కమలం వైపు దృష్టిసారిస్తున్నారని సమాచారం. త్వరలోనే ఆయన బీజేపీలో చేరికకు ముహూర్తం నిర్ణయిస్తారని తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్న రవీందర్ ఆ పార్టీని కాదని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి చేరేందుకు ఆసక్తి చూపించడంపై రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.