విజన్ కాదు.. విద్యార్థుల పాలిట పాయిజన్-
- యాడ్స్‌లోనే తెలంగాణ రైసింగ్.. హాస్పిటల్స్‌లో విద్యార్థులు ఫాలింగ్
- మెస్సీతో ఫుట్‌బాల్ ఆడేందుకు కోట్ల ఖర్చు
- పిల్లలకు మాత్రం తిండి లేదు
- మాజీ మంత్రి హరీశ్‌రావు
- కింగ్ కోఠి ఆసుపత్రిలో విద్యార్థులకు పరామర్శ
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాం తి): రేవంత్‌రెడ్డి విజన్ అని డబ్బా కొట్టుకుంటున్నారని, ఇది విజన్ 2047 కాదు.. విద్యార్థుల పాలిట పాయిజన్ 2047గా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. టీవీ యాడ్లు, పేపర్ యాడ్ల కోసం మాత్రమే తెలంగాణ రైసింగ్ అని, వాస్తవంలో గురుకుల, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హాస్పిటల్స్‌లో ఫాలింగ్ అని మండిపడ్డారు. నిజాయతీ ఉంటే గురుకులాల్లోని పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టాలని సూచించారు.
ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రిలో చేరిన విద్యార్థులు తిరిగి మళ్లీ హాస్టల్‌కి వెళ్లబోమని భయపడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో సన్నబియ్యంతో నాణ్యమైన ఆహారం అందేదని, ఇప్పుడు దొడ్డు బియ్యం పెడుతు న్నారని, అన్నం ఉడకడం లేదు, సరైన భోజనం పెట్టట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ.. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక గురుకులంలో, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలవుతున్నారని తెలిపారు.
షామీర్‌పేట్‌లో బీసీ గురుకులంలో అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు పోలీస్ స్టేషన్‌కి వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. మాదాపూర్‌లోని చందు నాయక్ తండాలో మధ్యాహ్న భోజనం వికటించి 43 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై విద్యార్థులే ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇప్పుడు బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకులంలో కలుషిత ఆహారం తిని 90 మంది ఆసుపత్రి పాలయ్యారన్నారు.
ఎందులో రైజింగ్?
తెలంగాణ ఎందులో రైజింగ్? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. అవినీతిలో రైసింగ్, అరాచకంలో రైసింగ్, అహంకారంలో, కబ్జాలో రైసింగ్ అని మండిపడ్డారు. 20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నామని అంటున్నారని, అప్పటివరకు పిల్లలు బతికుండేది ఎట్లా అని ప్రశ్నించారు. ఆసుపత్రి పాలైన విద్యార్థులను ఎన్నడూ సీఎం రేవంత్ పరామర్శించలేదని విమర్శించారు.
మెస్సీతో ఫుట్‌బాల్ ఆడేందుకు మేస్త్రీ కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. రూ.5 కోట్లతో స్టేడియం కట్టించుకున్నాడని, 100 కోట్లు ఖర్చుపెట్టి ఫుట్‌బాల్ ఆడటం ఎందుకు అని ప్రశ్నించారు. ఆ డబ్బుతో ఒక పూట కడుపునిండా అన్నం విద్యార్థులకు పెట్టలేవా? అని నిలదీశారు. 61 సార్లు ఢిల్లీకి పోవడానికి టైం ఉంది కానీ ఆసుపత్రి పాలయిన విద్యార్థులను పరామర్శించడానికి టైం లేదా అని ప్రశ్నించారు.
ఆరు గ్యారెంటీలకు నాది జిమ్మెదారి అన్న రాహుల్‌గాంధీ ఇప్పు డు ఎటు పోయారని ప్రశ్నించారు. రాష్ట్రంలో దాదాపు 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, 160 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారని, 116 మంది విద్యార్థులు చనిపోయారని ఇవన్నీ రాహుల్ గాంధీకి కనిపించడంలేదా అని ప్రశ్నించారు. 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీలు పోరాటం చేస్తున్నా ఆయన రాడు అని విమర్శించారు.
కానీ ఫుట్‌బాల్ చూసేందుకు ఎందుకు వచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి అట్టర్ ప్లాఫ్ అయ్యారన్నారు. త్రీ ట్రిలియన్ ఎకానమీ, ఫ్యూచర్ సిటీ అని గొప్పలు చెప్పడం కాదు.. ముందు హాస్టల్ పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టండని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెంకటేష్, ముఠా గోపాల్ ఉన్నారు.




