కేశనపల్లిలో ఘోర ప్రమాదం
ఆర్టీసీ బస్సు ఢీకొని వలస కూలీ మృతి
ముత్తారం,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలం కేశనపల్లి గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనడంతో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వలస కూలీ తిరుపతి (35) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం, కేశనపల్లి గ్రామం సమీపంలోని మూలమలుపు వద్ద తిరుపతి నడుచుకుంటూ వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు అతడిని వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు తిరుపతి తలకు తీవ్ర గాయాలై, రక్తస్రావం జరిగి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఆ ప్రాంతంలో ఉన్న మూలమలుపు ప్రమాదకరంగా ఉందని, తరచూ ఇక్కడ చిన్నపాటి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ముత్తారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ మంథని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వలస కూలీగా గుర్తించారు.






