3 July, 2026 | 10:07 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

మహిళా సాధికారతే మోదీ లక్ష్యం

03-07-2026 09:29 PM

ఎల్ఎండీ మహిళా శిశు వికాస్ కేంద్రంలో ఎమ్మెల్యే కవ్వంపల్లితో కలిసి, కుట్టు మిషన్లను అందించిన బండి

మానకొండూరు,(విజయక్రాంతి): మహిళా సాధికారతే మోదీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మహిళలు ఆర్ధికంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు మోదీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. మోదీ స్పూర్తితోనే తాను సైతం ఆటోలు, కుట్టు మిషన్లను పంపిణీ చేస్తూ మహిళలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అతి త్వరలోనే చట్ట సభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పార్లమెంట్, అసెంబ్లీలలో సైతం నూటికి 33 శాతం మంది మహిళా ప్రజా ప్రతినిధులు రాబోతున్నారని చెప్పారు.

కరీంనగర్  ఎల్ఎండీ కాలనీలోని  మహిళా శిశు వికాస కేంద్రంలో శుక్రవారం, కేంద్ర మంత్రి బండి సంజయ్  సీఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన కుట్టు మిషన్లను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో  స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మహిళా ఆర్థిక అభివృద్ధి సంఘం ఛైర్మన్ శోభారాణి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, జిల్లా అదనపు కలెక్టర్, ఆర్డీవో సహా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ మహిళాభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు బండి సంజయ్ చేస్తున్న సేవలను కొనియాడారు.

గతంలోనూ ఆటోలను పంపిణీ చేశారని, ఇప్పుడు కుట్టు మిషన్లను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ... మహిళలకు సీఎస్సార్ నిధులతో కుట్టు మిషన్ల పంపిణీ చేయడం చాలా సంతోసంగా ఉందన్నారు. గతంలోనూ ఆటోలను ,దాదాపు వెయ్యి కుట్టు మిషన్లను, ట్రాలీ ఆటోలను అందించానని, వాటిని మహిళలు విజయవంతంగా నడుపుతున్నారని చెప్పారు. కుట్టు మిషన్లను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉజ్వల యోజన కింద  దాదాపు 9 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి 11 కోట్ల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించారు.

దేశంలో 4 కోట్ల ఇండ్లను నిర్మించి మహిళల పేరిటే అందిస్తున్నారు. మరో 3 కోట్లను నిర్మిస్తున్నారు. ప్రధానమంత్రి మాత్రు వందన యోజన కింద గర్భిణీ మహిళలకు మొదటి బిడ్డకు 5 వేలు, రెండో బిడ్డ ఆడపిల్ల పుడితే 6 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నారు. నారీ శక్తి వందన్ అధినీయం కింద చట్ట సభలో 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. అతి త్వరలోనే పార్లమెంట్ లో బిల్లును ఆమోదింపజేసి నూటికి 33 శాతం మంది మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టేలా చేస్తామని వివరించారు.