29-09-2025 03:34:45 PM
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మరోసారి తగిన గుణపాఠం చెబుతామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో సమాధానం చెప్పినటికి వారి తీరు మారలేదని మంత్రి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోమారు జయకేతనం ఎగరేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆదివారం జరిగిన జనగర్జన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని మంత్రి జూపల్లి విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ(Bharat Rashtra Samithi Party) సిద్దంగా ఉందని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) అన్నారు. ఇప్పటికే ఆయన అన్ని జిల్లాల నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో నిర్వహించి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు పూర్తి భాద్యతలిచ్చినట్లు తెలిపారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం(Telangana State Election Commission) సోమవారం రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని 565 మండలాల్లో స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ. రాణి కుముదిని(State Election Commissioner I. Rani Kumudini) ప్రకటించారు. మొదట ఎంపీటీసీఎం, జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించి, తరువాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. అక్టోబర్ 9 నుండి ఐదు దశల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. మొదటి దశ ఎన్నికలు అక్టోబర్ 23న, రెండవ దశ ఎన్నికలు అక్టోబర్ 27న జరుగుతాయి. గ్రామ పంచాయతీలకు మొదటి దశ ఎన్నికలు అక్టోబర్ 31న, రెండవ దశ నవంబర్ 4న, మూడవ దశ నవంబర్ 8న జరుగుతాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత, అదే రోజున లెక్కింపు జరుగుతుంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరుగుతుందని రాణి కుముదిని పేర్కొన్నారు.